KTR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేదని రేవంత్ రెడ్డి అన్నారని కేటీఆర్ తెలిపారు. సీఎం పదవిలో కూర్చొని రేవంత్ రెడ్డి తెలంగాణను కించపరిచారని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరిని మోసం చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని దివాళాకోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించారు.
దేశంలో అత్యధిక జీతాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం గురించి రేవంత్ అవమానకరంగా మాట్లాడారని కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దిగజారిందని రేవంత్ మాట్లాడడం వారిని అవమానపరచడమే అని అన్నారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి అనేక గొప్ప కార్యక్రమాలను ఎంతో కృషితో పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగుల స్థితిగతులపైన సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం కాదు కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగోలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని నాశనం చేసింది ముమ్మాటికీ రేవంత్ రెడ్డినే అని విమర్శించారు. మూర్ఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందని తెలిపారు.
రాష్ట్రానికి ఆర్థిక ఇంజన్‌గా ఉన్న హైదరాబాద్‌లో హైడ్రా, మూసీతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని కేటీఆర్ అన్నారు. సంవత్సరంలో లక్షా 38 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు.కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు పంచారని.. మరి రేవంత్ అప్పు చేసి ఢిల్లీకి మూటలు పంపుతున్నారా అని ప్రశ్నించారు. దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం కాదు అని.. దివాళా తీసింది రేవంత్ రెడ్డి మెదడు అని ఎద్దేవా చేశారు. రూ. 5,943కోట్ల రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగించామని తెలిపారు. రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు అబద్ధం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.