CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్టు తయారైంది. క్యాబినెట్ విస్తరణ నేడో రేపో అంటూ ఎనిమిది నెలలుగా వాయిదా పడుతూనే ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇతర నేతలు ఢిల్లీ వెళ్లడం, అధిష్ఠానంతో చర్చించడం, తిరిగి రావడం, ఇక రేపో మాపో అయిపోతుందని లీకులు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. దీనికి కొనసాగింపుగాను మంత్రివర్గ విస్తరణపై గురువారం ఢిల్లీలో మరోసారి హైడ్రామా నడిచింది. ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానం పెద్దలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో వరుసగా భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ కూర్పుపై లోతుగా చర్చించినట్టు తెలిసింది. సామాజిక కూర్పు, సీనియార్టీ, జిల్లా ప్రాతిపదికన పలువురు పేర్లపై చర్చించినట్టు సమాచారం. ఆ తర్వాత సీఎం రేవంత్ నివాసంలో కీలక నేతలు లంచ్ మీటింగ్‌లో తదుపరి చర్చలు కొనసాగించినట్టు తెలిసింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా మొత్తం భర్తీ చేయాలా లేక సగం భర్తీ చేసి మిగిలినవి ఆపేయాలా అన్న అంశంపైనా చర్చించినట్టు చెప్తున్నారు. ఈ సారైనా చర్చలు ఫలించి మంత్రివర్గ విస్తరణ పూర్తవుతుందా లేక షరామాములుగానే మళ్లీ పెండింగ్‌లో పడుతుందా అన్న అనుమానాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
పట్టించుకోని బడే భాయ్?
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినట్టు సమాచారం. అయితే వారు స్పందించలేదని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ పనుల కోసం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారన్న విమర్శల నేపథ్యంలో.. ప్రధానిని, అమిత్ షాను కలిసి, ఒక వినతి పత్రం ఇవ్వాలని, అధికారిక పర్యటన కోసమే వచ్చానని చెప్పుకోవాలని సీఎం భావించారని అంటున్నారు. అయితే వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఉసూరుమన్నారని చెప్పుకుంటున్నారు.