Revanth Reddy | హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాల్లో సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిలో 50 గురుకులాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాలకు గురుకులాలు కేటాయించకపోవడంపై ప్రజలు, ప్రతిపక్షనేతలు మండిపడుతున్నారు.
బీఆర్ఎస్కు ప్రస్తుతం 28 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలున్నారు. వాటిలో ఆసిఫాబాద్, మేడ్చల్ నియోజకవర్గాలకు మాత్రమే గురుకులాలు కేటాయించారు. ఎంఐఎం, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు ఒక్కొక్కటి చొప్పున మూడు కేటాయించారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు వెలువరించింది. ఒక్కో గురుకులానికి రూ.200 కోట్ల చొప్పున మొత్తం 11,000 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొంది. మరోవైపు మినిస్టర్ క్వార్టర్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించడం కోసం ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు. ఒక్కో గురుకుల విద్యాలయం సుమారు 20 నుంచి 25 ఎకరాల స్థలంలో ఉంటుందని చెప్పారు. విద్యాశాఖ విడుదల చేసిన జీవోపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
ఎన్నికల సమయంలో అన్ని నియోజకవర్గాలలో తిరిగి ఓట్లు అడిగిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు అన్ని నియోజకవర్గాలను సమానంగా ఎందుకు చూడడంలేదని పలు ప్రజాసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలోనే గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేస్తే మిగిలిన ప్రాంతాలు, అక్కడి పిల్లల పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు.