ఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన రెండో రోజూ కొనసాగుతున్నది. గురువారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రితోపాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం.. తాజాగా యూపీఎస్సీ (UPSC) చైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీని కలిశారు. ఆయనతోపాటు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, మరికొందరు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా యూపీఎస్సీ పనితీరు పరిశీలన, పరీక్షల నిర్వహణ ఇతర అంశాలను అధ్యయనం చేయనున్నారు.
ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఏటా జాబ్ క్యాలండర్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టిసారించింది. మరోవైపు టీఎస్పీఎస్సీపై పలు ఆరోపణల నేపథ్యంలో చైర్మన్ జనార్దన్ రెడ్డితోపాటు ముగ్గురు సభ్యులు రాజీనామా చేసిన విషయం విధితమే. వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై పెండింగ్లో పెట్టారు.