హైదరాబాద్, జూలై 7(నమస్తే తెలంగాణ): పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను అధిష్ఠానం ముందు పెట్టాలనే ప్రధాన ఎజెండాతోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. సోమవారం 47వసారి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దొరికితే ఆయనకు, అది వీలుకాకుంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాష్ట్ర పార్టీ పరిస్థితులను వివరించేందుకు సిద్ధమైవెళ్లినట్టు తెలిసింది. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఖర్గే రాష్ట్ర పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, ఎమ్మెల్యేల గ్రూపు రాజకీయాలు, ఎమ్మెల్యేలు నేరుగా మంత్రులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడంపై ఖర్గే ఆందోళన చెందినట్టు సమాచారం.
దీంతోపా టు రాష్ట్రంలో 65మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండగా, 53 నియోజకవర్గాల్లో వర్గపోరు ఉన్నదని, ఇందులో 41 నియోజవర్గాల్లో తీవ్రస్థాయి వర్గ విభేదాలు ఉన్నట్టు ఆ పార్టీ వ్యూహకర్త.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పించిన నివేదిక ప్రతి కూడా ఖర్గేకు అందినట్టు సమాచారం. దీంతోపాటు సీనియర్ ఎమ్మెల్యే ఒకరు తనతో మాట్లాడుతూనే, చర్చల నుంచి అర్ధాంతరంగా అలిగి వెళ్లిపోవడం, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పిలిచినా భేటీకి గైర్హాజర్ కావడం పట్ల ఖర్గే సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీలో నెలకొన్న వర్గపోరుపై నివేదికలు తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు తెలిసింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారింది. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒక వర్గంగా, హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కే నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు మరో వర్గంగా చీలిపోయి పరస్పర విమర్శలు, ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. వచ్చే ఎన్నికల్లో తాను పాలకుర్తి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని కొండా మురళి పదేపదే కార్యకర్తలకు చెప్తుడటంతో అక్కడి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి కౌంటర్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కోడలు పాలకుర్తి నుంచే పోటీ చేస్తారని, తాను మరో నియోజవర్గం నుంచి పోటీలో ఉంటానని యశస్వినీరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి చెప్తున్నారు. జనగామ జిల్లాలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య వర్గపోరు తీవ్రమైంది. ఇటీవల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఇరు వర్గాలు కొట్టుకునే వరకు వచ్చిందని పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవిపై పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అలంపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సంపత్, మల్లు రవి వర్గాల మధ్య విభేదాలున్నట్టు కార్యకర్తలు చెప్తున్నారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోని ఎంపీ మల్లు రవి.. కాంట్రాక్టర్లకు 10% కమీషన్‌తో కాంట్రాక్టు బిల్లులు ఇప్పించారంటూ అలంపూర్ కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. వనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డికి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్నది. గద్వాలలో స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరితాయాదవ్కు, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి పడటం లేదు.
ఆదిలాబాద్ జిల్లాలో గడ్డం కుటుంబంపై పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగానే తిరుగుబాటు చేస్తున్నారు. జిల్లాలో గడ్డం కుటుంబం పెత్తనం తగ్గించాలని అధిష్ఠానానికి లేఖలు రాస్తున్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు విరుద్ధంగా ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి పార్టీ టికెట్లు ఇవ్వడమే కాకుండా, ఇప్పుడు అదే కుటుంబానికి మంత్రి పదవి కూడా ఎలా ఇస్తారని పార్టీ సీనియర్ నేత ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ప్రేమ్‌సాగర్‌రావు.. ఖర్గేతో జరిగిన భేటీ నుంచి అర్ధాంతరంగా బయటికి వచ్చి తన అసంతృప్తిని వ్యక్తంచేసినట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. నిర్మల్‌లో బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీన్ని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయారని రాష్ట్ర పార్టీకి ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది.
భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్య మధ్య విభేదాలున్నాయి. తుంగతుర్తిలో మందుల సామెల్ వర్సెస్ అసలు కాంగ్రెస్ నేతలు అన్నట్టుగా వర్గపోరు సాగుతున్నది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మధ్య వర్గపోరు సాగుతున్నది. ఇలా దాదాపు 53 నియోజకవర్గాల్లో వర్గపోరు ఉన్నట్టు, ఇందులో 41 నియోజవర్గాల్లో తీవ్రస్థాయి వర్గ విభేదాలు ఉన్నట్టు ఆ పార్టీ వ్యూహకర్త నివేదించినట్టు సమాచారం. ఈ నివేదికతోనే ఢిల్లీకి వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వర్గ విభేదాలతో నామినేటెడ్ పోస్టులు నింపలేకపోతున్నామని నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
నిజామాబాద్ జిల్లా బాన్సువాడలోఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో వర్గపోరు రాజుకున్నది. ఇక్కడినుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన రవీందర్‌రెడ్డి.. ఎన్నికల ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి బాన్సువాడ టికెట్ పొందారు. దీంతో ఆ టికెట్ ఆశించిన బాల్‌రాజ్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బాల్‌రాజ్‌కు టీఎస్ ఆగ్రోస్ చైర్మన్ పదవి ఇచ్చారు. తాజాగా బాల్‌రాజ్, పోచారం ఒక వర్గంగా, ఏనుగు రవీందర్‌రెడ్డి వైరివర్గంగా వర్గపోరు నడుస్తున్నది. ఇద్దరు కలిసి తమ కార్యకర్తల మీద పోలీసు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఇటీవల ఏనుగు రవీందర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు.