బీఎల్వోలు పనిచేయరు.. నిద్రపోతరు. ప్రభుత్వాధికారి కాబట్టి పనిచేస్తే చేస్తడు.. చేయకపోతే చేయడు. నడుస్తే నడుస్తడు.. కూసుంటే కూసుంటడు లేకపోతే నిద్రపోతడు. ఆయనకు పోయేదేం లేదు. ఆయనకు వచ్చే జీతం బ్యాంకులో వేస్తరు. మూడో తారీఖు వరకు కాలం గడిపితే చాలు వాళ్ల జీతం వాళ్లకు వస్తది. సన్నబియ్యం కట్ కాదు, ఇందిరమ్మ ఇల్లు కట్ కాదు, వాళ్లకు అభివృద్ధి పోదు, సంక్షేమం పోదు. పనిచేయకున్నా వాళ్లకు నష్టమేమీ లేదు.
– బీఎల్వోలను ఉద్దేశించి కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
వికారాబాద్, జూలై 22(నమస్తే తెలంగాణ) : బీఎల్వోలపై సీఎం రేవంత్‌రెడ్డి నోరుపారేసుకున్నారు. వాళ్లు పనిచేయరు.. నిద్రపోతారు, జీతాలు మాత్రం తీసుకుంటారంటూ బూత్ లెవల్ ఆఫీసర్లపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా బీఎల్వోలు పనిచేయకున్నా ఒరిగేదేమీ లేదని.. సన్నబియ్యం, కల్యాణలక్ష్మీ, ఇందిరమ్మ ఇండ్లు పథకాలేవీ కట్ కావు అంటూ చెప్పుకొచ్చారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ‘సర్’ బీఎల్వోలతో సమావేశమైన సందర్భంగా ఇలా షాకింగ్ కామెంట్లు చేశారు. అదే సమయంలో రోజుకు 18 గంటలు పనిచేసినా సరిపోవడం లేదని.. ఓవైపు తాను పాలనలో బిజీగా ఉంటే దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
నేను గెలువకుండా కుట్రలు చేస్తున్నరు..
కొడంగల్ నియోజకవర్గంలో ‘సర్’ ప్రక్రియ ఆందోళనకరంగా ఉన్నదని, ఇప్పటివరకు 78శాతం ఎస్ఐఆర్ నమోదైందని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతున్నదని, ఇది తన గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో పొగపెడితే రేవంత్‌రెడ్డి బయటకు రాకుండా ఉంటారని కుట్రలు చేస్తున్నారని, ఎదురు నిలబడలేక దొంగదెబ్బ తీయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కొడంగల్‌లో ఇప్పటివరకు 1,96,620 ఓటర్ల ప్రక్షాళన జరిగిందని, ఇంకా 54,635 ఓట్ల ప్రక్షాళన జరుగాల్సి ఉన్నదని చెప్పారు. మొత్తం ఓట్లలో ఇంకా 22శాతం ‘సర్’ నమోదుకాలేదని, ఆ ఓట్లను తొలగిస్తే ప్రమాదం పొంచి ఉన్నదని తెలిపారు. తన నియోజకవర్గంలో 35వేల ఓట్లు బోగస్ ఓట్లున్నాయని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని.. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను తొలగించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ఆరోపణలు చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటు కోల్పోవడానికి వీల్లేదని, ఈ నెల 30లోగా నూటికి నూరు శాతం కొడంగల్ నియోజకవర్గంలో ప్రక్షాళన పూర్తి కావాలని స్పష్టంచేశారు.
దేశాన్ని దోచుకుంటున్న నరేందర్, ధర్మేందర్
నరేందర్, ధర్మేందర్ ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్నుద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. బీజేపీపాలిత రాష్ర్టాల్లో ప్రశ్నపత్రాలను అమ్ముకొంటున్నారని, నీట్ ప్రశ్నాపత్రాలను పల్లీబఠానీల్లా కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. రాజకీయ పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని, ప్రజా ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ధర్మేంద్ర ప్రదాన్‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, నీట్ ప్రశ్నాపత్రాలను అమ్ముకున్న వారిని అరెస్ట్ చేసి జైళ్లో పెట్టాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన వారిని శిక్షించాల్సింది పోయి విద్యార్థులపై పాశవికంగా దాడి చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పేపర్ లీక్‌పై పార్లమెంట్లో చర్చ జరుగకుండా అడ్డుకున్నారని, అందరం కలిసి పోరాటం చేసి మోదీని గద్దె దించుదామని పేర్కొన్నారు.
మా మనోహర్.. ఎకరాల్లో కొని గజాల్లో బకరాలకు అమ్ముతుండు
తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిపై సీఎం సెటైర్లు వేశారు. ‘మా మనోహర్ ఏం చేస్తుండో.. ఎకరాల్లో కొని గజాల్లో బకరాలకు అమ్ముతుండో తెల్వదు కానీ.. ఆ పని ఓ పది రోజులు వాయిదా పెట్టి బూత్‌లవారీగా తిరుగాల్సిందే’ అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘సర్’ ప్రక్రియలో తాండూర్ నియోజకవర్గం వెనుకబాటే కారణమా లేదంటే నియోజకవర్గానికి సమయం ఇవ్వకుండా అధిక సమయం రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలకు కేటాయిస్తుండటమా అని సీఎం వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ప్రణబ్ ముఖర్జీని ప్రధానిని చేశారంటూ తడబాటు
తడబాటు అలవాటుగా మారిన సీఎం రేవంత్ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ మరోసారి తడబడ్డారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సోనియాగాంధీ ప్రధాని, రాష్ట్రపతి పదవులను త్యాగం చేశారని, ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేశారని సెలవిచ్చారు. రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీని ప్రధానిని చేశారంటూ సీఎం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ అయ్యింది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి తేడా తెలియకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.