హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో తిరిగి కేసీఆర్ పాలనా దృశ్యం పునరావిష్కరణ అవుతుందా? తెలంగాణ ప్రజలు పోగొట్టుకున్న చోటే తిరిగి వెతుక్కుంటున్నారా? మునుపెన్నడూ లేనివిధంగా కేసీఆరే తిరిగి అధికారంలోకి రావాలని తమ కేరింతలతో నేటి జెన్‌జీ తరం ఆహ్వానిస్తున్నదా? అంటే అవుననే అంటున్నాయి గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై బురదజల్లడమే పనిగా సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ పెట్టుకోగా.. అదే కేసీఆరే రేపటి ప్రత్యామ్నాయం, ఆయన ఆనవాళ్లే సత్యం, ఆయన పాలన అనివార్యం అని యువత కేరింతలతో తమ సమ్మతాన్ని చాటుతున్నది.
కేసీఆర్ పాటలతో క్రేజీ చాటుతున్నది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా చోటుచేసుకొంటున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలకు ఆసక్తికరమైన ట్రెండ్‌ను ఆవిష్కృతం చేశాయి. ఈ ట్రెండ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తుండగా, బీఆర్ఎస్ పార్టీలో జోష్ నింపుతున్నది. రాష్ట్ర పాలనా సౌధమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, ట్యాంక్‌బండ్ పరిసరాలు, ఖైరతాబాద్ బడా గణేశ్, సికింద్రాబాద్ జేబీఎస్ మీదుగా మెదక్, కరీంనగర్ దారులు, అటు ఉప్పల్ రింగ్‌రోడ్ మీదుగా వరంగల్, నాగోల్ మీదుగా నల్లగొండ రాష్ట్ర నలుమూలల్లో రోజురోజుకూ కేసీఆర్ పట్ల క్రేజీ పెరుగుతుందుని గణేశ్ నవరాత్రి ఉత్సవ వేదికలే స్పష్టం చేస్తున్నాయి. ‘కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తా.. అందుకు నాదీ జిమ్మేదార్’ అని అసెంబ్లీ సాక్షిగా అనేక సందర్భాల్లో ప్రకటించిన రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులకు గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు కంటిమీద కునుకేలేకుండా చేస్తున్నాయి.
హైదరాబాద్ మహానగరంలో జరిగే గణేశ్ శోభాయాత్రలో కేసీఆర్ పాటల ప్రకంపనలు మార్మోగుతున్నాయి. నగరంలోని అత్యధిక విగ్రహాలను ట్యాంక్‌బండ్ వద్ద హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తారు. ఆ సంబురాన్ని చూసేందుకు నగరవ్యాప్తంగా తరలివచ్చిన ప్రజలతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కేసీఆర్‌పై యువత రోజురోజుకూ పెంచుకుంటున్న మురింపెం ఇక్కడ ప్రస్ఫుటమవుతున్నది. ఆ క్రేజీ ప్రతిఫలించేలా ఇప్పుడు ట్యాంక్‌బండ్ పరిసరాలు కేసీఆర్ పాటలతో దుమ్మురేపుతున్నాయి.
‘గింగిర గిరగిరగిర ఔర్ ఏక్ దక్కా.. కేసీఆర్ పక్కా.. దేఖ్లేంగే..దేఖ్లేంగే.., సారే రావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల.., గులాబీల జెండలే రామక్క.., ఉద్యమాల బదులు ఉగ్గుపాలు బోసి ఏ తల్లి నినుగన్నదో.. ఓ సారూ కేసీఆరు.., ‘యాదిల యాదికొస్తున్నవే సారూ.. మళ్ల ఎన్నడొస్తవు కేసీఆరు’ అన్న పాటలు మార్మోగుతున్నాయి. యువతీయువకులు కేసీఆర్ పాటలు పాడుతూ అభిమాన పారవశ్యంతో ఊగిపోతున్నారు. ఏ వాహనం చూసినా అవే పాటలు, ఏ ఒక్కరి నోట కేసీఆర్ జపమే. గత వారం రోజులుగా సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్ పరిసరాల్లో కేసీఆర్ పాటల కోలాహలం నెలకొన్నది.
సచివాలయం గేటు వద్దకు రాగానే వాహనాల్లోని మైకుల్లో కేసీఆర్ పాటలు ఊపందుకొంటున్నాయి. బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం చూడగానే యువతలో కేసీఆర్‌పై ఉన్న అభిమానం ఉప్పొంగిపోతున్నది. ఆయన కట్టిన అద్భుతాలను చూసిన ప్రతి ఒక్కరూ మురిపెం ప్రదర్శిస్తున్నారు. ఆ పాటలకే యువత నృత్యాలు చేస్తూ ఊగిపోతున్నది. ట్యాంక్‌బండ్ అటు కడ నుంచి ఇటు కడదాకా తమ వాహనాలు ఆపినచోట కేసీఆర్ పాటలు పెట్టుకొని రోడ్డుపై, వాహనాలపై నృత్యాలు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. ఈ సందడి నగరవాసులు, సందర్శకులు, పర్యాటకులకు కనులవిందుగా గోచరిస్తున్నది. ఇంకో నాలుగు రోజులు ఇవే సంబురాలు ఉంటాయి. కొన్ని వాహనాల నుంచి పోలీసులు డీజే బాక్స్‌లను లాక్కెళ్లినప్పటికీ, సెల్ఫోన్లలో కేసీఆర్ పాటలు పెట్టుకొని యువత ఆనందం పంచుకుంటున్నది. జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ చైతన్యం ప్రదర్శించారు.
చెరిపేస్తే చెరిగిపోవడానికి అది పేరు కాదు.. కేసీఆర్ అనే బ్రాండ్ అని విశ్లేషకులు సైతం ఒప్పుకొంటారు. అదే బ్రాండ్ తెలంగాణను ఏలాలని నేటి యువత బలంగా కోరుకుంటున్నది. ఆ విషయం ఈ గణేశ్ శోభాయాత్ర ద్వారా తేటతెల్లమవుతున్నది. ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా, అభివృద్ధిపథంలో నడిపిన పాలనాదక్షుడిగా ఆయనే రాష్ర్టానికి భరోసా అని జెన్‌జీ నమ్ముతున్నది. అందుకే వేడుక ఏదైనా, వేదిక ఏదైనా మనోగతాన్ని తెలంగాణ యువత గల్లా ఎత్తి గళమెత్తుతున్నారు. అందుకే సంబురమేదైనా గులాబీ దళపతి పాట పెట్టాల్సిందే. ఆ పాటకు చిన్నాపెద్దా చిందులెయ్యాల్సిందే.
అధికారంలో ఉన్నవారికి భజనలు చేయబోం, మా గుండెల్లో పెట్టి చూసుకొన్న వారినే కొలుస్తామని కేసీఆర్‌పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కల్చర్‌కు అలవాటుపడిన జెన్ జీ.. కేసీఆర్ మ్యానరిజమ్‌ను, ఆయన తెలంగాణ యాసలోని పదునైన డైలాగులను రీమిక్స్ చేసి డీజే ట్రాక్‌లుగా మలుచడం విశేషం. ఆడియో విజువల్స్ స్రీన్లపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ైస్లెడ్స్ ప్రత్యక్షమవుతుంటే యూత్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. జెన్‌జీ యువతకు కేసీఆర్ కేవలం ఒక నాయకుడో లేదా మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఒక విశిష్టమైన సాంస్కృతిక ప్రతీక.
తెలంగాణ మాండలికంలో ఆయన మాట్లాడే పదునైన శైలి యువతకు ఒక ప్రత్యేకమైన మాస్ మ్యానరిజాన్ని ఇస్తున్నది. అధికారంలో ఎవరున్నా, జనరేషన్-జెడ్ తమకు నచ్చిన నాయకుడి వాయిస్‌ను, మాస్ ఆటిట్యూడ్‌ను ఉత్సవాల వేదికగా సంబురంగా జరుపుకోవడాన్ని స్వేచ్ఛా సంకేతంగా భావిస్తున్నరు. ఈ పరిస్థితిని గమనించి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వినాయక చవితి సందర్భంగా డీజేలు నిషేధమని నోటీసులు జారీచేసినా యువత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఆపలేకపోయింది. నోరు విప్పితే కేసీఆర్ కీడును కోరుకుంటున్న ప్రస్తుత పాలకులకు కేసీఆర్ పాటలతో చిందేస్తున్న జెన్‌జీ క్రేజీ చెంపపెట్టులా మారిందని చెప్పవచ్చు. కేసీఆర్ పాటలు పెట్టుకొని యువత తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే కూడా ఓర్వలేని సర్కార్.. పోలీసుల ద్వారా లాఠీచార్జ్ చేయిస్తున్నది. అయినా ఉద్యమనేత పేరు మారుమోగుతూనే ఉన్నది.
రాష్ట్రంలో నెలకొంటున్న ఈ ప్రతికూల పరిస్థితులను అదుపుచేయడం కోసం తాము ఎంతకైనా వెనుకాడం అని కాంగ్రెస్ ప్రభుత్వం విపరీత చేష్టలకు దిగినా యువత బెదరడం లేదు. కేసీఆర్‌పై వెల్లువెత్తుతున్న ప్రజాభిమాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వ ప్రయత్నం చేస్తున్నా యువకులు తగ్గడమే లేదు. కేసీఆర్ పాటలతో హోరెత్తిస్తున్న గణేశ్ నిమజ్జన శోభాయాత్రికులను పోలీసులు చెదరగొట్టడం, వారి వాహనాల్లో ఉన్న డీజే బాక్స్‌లను కొన్నిచోట్ల పగులగొట్టడం, మైకులు లాక్కోవడం చేస్తున్నారు. ఇలాంటి పోలీస్ చర్యలను సైతం వీడియోలు తీసి మరీ యువకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులను ఉపయోగించి, డీజేల్లో కేసీఆర్ పాటలను నిలువరించినంత మాత్రాన కేసీఆర్‌పై ప్రజల గుండెల్లోని అభిమానాన్ని ప్రభుత్వం దూరం చేయలేదని విశ్లేషకులు పేర్కొనడం గమనార్హం.