హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే విద్యుత్తు వ్యవస్థ నిర్వహణను పూర్తిగా భ్రష్టుపట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాటి కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లపాటు అహర్నిశలు శ్రమించి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్తు దిశగా నడిపిస్తే, ప్రస్తుత పాలకుల అసమర్థ విధానాల వల్ల రాష్ట్రంలో మళ్లీ విద్యుత్తు సంక్షోభం తలెత్తి అన్నదాతలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన, విద్యుత్తు, సాగునీటి నిర్వహణ,యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో నాసిరకం బొగ్గు వాడకం, రాజస్థాన్‌కు విద్యుత్తు ఇవ్వడం, ఏపీ సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్‌రెడ్డి కృష్ణా నీళ్లపై చేస్తున్న రాజకీయంపై మీడియాతో పలు విషయాలు వెల్లడించారు.
యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహణలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నదని హరీశ్ విమర్శించారు. ప్లాంట్ నిర్వహణకు అత్యంత నాణ్యమైన జీ10, జీ11 బొగ్గు అవసరం ఉంటే, అందుకు విరుద్ధంగా జీ 13, జీ 14 నాసిరకం బొగ్గును వాడుతూ యంత్రాల సామర్థ్యాన్ని నాశనం చేస్తున్నారని వాపోయారు. దీనికితోడు కొత్తగూడెంలో 800 మెగావాట్లు, భద్రాద్రిలో 540 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అర్ధాంతరంగా నిలిచిపోయినా పాలకుల్లో చలనం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. థర్మల్ కేంద్రాల్లో కనీసం 45 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలన్న నిబంధన ఉన్నా, గతంలో ఉన్న 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. బొగ్గు కొరతపై వాస్తవాన్ని పరిశీలించేందుకు తాను క్షేత్రస్థాయికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం వెనుక ఆంతర్యమేందని ప్రశ్నించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో దేశంలోనే అరుదైన రీతిలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రతిష్ఠాత్మక యాదాద్రి ఆల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించారని హరీశ్ గుర్తుచేశారు.ప్రస్తుత ప్రభుత్వం పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోలేక కేవలం 400 మెగావాట్లకే పరిమితం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్లాంట్ పూర్తిస్థాయిలో పనిచేయకపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్తు కొరత నెలకొన్న పరిస్థితుల్లో రాజస్థాన్ ప్రభుత్వంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు 1,600 మెగావాట్ల విద్యుత్తు ఇవ్వాల్సి ఉన్నదని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తొలి విడతగా 800 మెగావాట్ల కేంద్రాన్ని ఏర్పాటు చేయించి విద్యుత్తు పొందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎలాంటి అదనపు భారం లేని ఎన్టీపీసీ విద్యుత్తును కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వద్దనుకున్నదో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం అందించిన విద్యుత్తులో కనీసం మూడో వంతు కూడా కాంగ్రెస్ ఇవ్వలేకపోతున్నదని హరీశ్ ఎద్దేవాచేశారు. రైతులకు కనీసం 7 నుంచి 8 గంటలు కూడా నిరంతర విద్యుత్తు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
నీటి నిర్వహణ విషయంలోనూ తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తాకట్టు పెట్టిందని హరీశ్ ధ్వజమెత్తారు. కృష్ణా బేసిన్‌కు ఏమాత్రం సంబంధం లేని కుప్పం ప్రాంతానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం నుంచి ఏకంగా 700 కిలోమీటర్ల దూరం నీళ్లను తరలించుకుపోతుంటే రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. సొంత బేసిన్ పరిధిలోనే ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు తేలేక, రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లా పంటలను సైతం ఎండబెడుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో రైతులు సంతోషంగా కేరింతలు కొడుతుంటే, తెలంగాణలో మాత్రం సాగునీరు, విద్యుత్తు అందక రైతులు ఆక్రందనలు చేస్తున్నారని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణంకోసం చేపట్టిన తర్వాత ఇప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ నేతలు దిగజారుడు రాజకీయం చేస్తున్నారని హరీశ్ విమర్శించారు. గులాబీ చొకాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు.