Revanth Reddy | అనేక అంశాలపై అలవోకగా నాలుక మడతేసే రేవంత్‌రెడ్డి.. ఆదివారం నర్మెట సభలో తన మడమతిప్పే ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో 2021లో కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా ‘వరి దీక్ష’ చేపట్టిన రేవంత్‌రెడ్డి.. నాడు రైతులు వరి వేయాల్సిందేనంటూ, ప్రభుత్వం వడ్లను కొనాల్సిందేనంటూ మాట్లాడారు. కేంద్రం కొనబోనంటే.. ముఖ్యమంత్రి ఎలా ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. అదే రేవంత్.. సీఎం హోదాలో ఆదివారం నర్మెటలో జరిగిన పామాయిల్ పరిశ్రమ ప్రారంభ కార్యక్రమంలో నాటి తన మాటలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. వరి వేయొద్దంటూ రైతులకు సూచించారు. 50 లక్షల మెట్రిక్ టన్నులకు మించి కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనబోను అంటున్నదని చెప్పుకొచ్చారు.
ఇప్పుడెవరు ముఖ్యమంత్రి? ఇప్పుడేమయ్యాయి ఆ ప్రగల్భాలు? కేసీఆర్ పాలనలో ఏనాడూ కానరాని యూరియా కొరతను.. రెండేండ్లుగా కాంగ్రెస్ ఏలుబడిలో రైతాంగం చూస్తూనే ఉన్నది. వచ్చే వానకాలంలోనూ ఆ కష్టాలు తప్పవంటూ రేవంత్ తేల్చిచెప్పేశారు. యూరియా పంపిణీ చేయలేమని చేతులెత్తేశారు! రాష్ట్రంలో రెండేండ్లుగా కొరత కొనసాగుతున్నా, ప్రభుత్వం ఏం పాఠం నేర్చుకున్నట్టు? ప్రతి సీజన్లోనూ కొరత కొనసాగుతున్నా ఏం ప్రిపేర్ అయినట్టు?
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి వరి సాగుపై కీలక వ్యాఖ్యలు చేశారు. వరి సాగు లాభసాటి కాదని, అనేక సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కాబట్టి వరి సాగు చేయొద్దని రైతులకు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంతో పాటు రైతుభరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ‘దేశంలోనే వరి సాగులో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. వరి సాగులో కష్టం తక్కువ ఉన్నదని మీరు వరి పండిస్తున్నరు.. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. కానీ ఈ వడ్లను ఏం చేసుకోవాలి? విదేశాలకు ఎగుమతి చేద్దామంటే ప్రభుత్వానికి గిట్టుబాటు కావడం లేదు.
అందుకే రైతులు పంట మార్పిడీ చేయాలి. వరి ఒక్కటే పరిష్కారం కాదు. ఇకపై రైతులు పప్పులు, కూరగాయలు పండించాలి’ అని సూచించారు. వరికి బదులు చెరుకు, సోయాబీన్, ఎర్రొజన్న, పుసుపు, మొక్కజొన్న, కంది వంటి పంటలు పండించాలని చెప్పారు. గతంలో నిజామాబాద్‌లో రైతులు పసుపు అమ్ముకొని తులం బంగారం కొనుగోలు చేసేవారని, కానీ ఇప్పుడు బంగారం ధర రూ. 2 లక్షలకు చేరిందని, కానీ పసుపు పంటకు మాత్రం ధర రావడం లేదని తెలిపారు. ఇలా ఓవైపు పసుపు పంటకు ధరలేదని చెప్తూనే మరోవైపు రైతులను పసుపు పండించాలని చెప్పడం గమనార్హం. వరి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తే నష్టం వస్తుందనే ఆలోచన చేయొద్దని, నష్టం వచ్చినా ఇతర పంటలే సాగు చేయాలని సూచించారు.
‘ఇటీవల కేంద్ర మంత్రిని కలిసినప్పుడు 50 లక్షల టన్నుల కన్నా ఎక్కవ కొనుగోలు చేయబోమని చెప్పారు. కానీ ఇప్పటికే మనం 71 లక్షల టన్నులు కొనుగోలు చేసినం, అలాంటప్పుడు కొన్న వడ్లను ఏం చేయాలి?’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కొన్న వడ్లను విదేశాలకు ఎగుమతి చేద్దామంటే ప్రభుత్వానికి గిట్టుబాటు కావడం లేదని చెప్పడంపై సర్కార్‌ను సీఎం వ్యాపార సంస్థగా భావిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతుల కష్టాన్ని వ్యాపార కోణంలో చూస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై నాటి బీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఎలా అంటారని, రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రైతుల పంట కొనుగోలుకు ఆ మాత్రం కేటాయించలేరా? అని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట మార్చి మళ్లీ ఆయనే కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాదన అందుకున్నారు.
కాలం మారిందని, అందుకు అనుగుణంగా రైతులు కూడా మారాల్సిన అవసరం ఉన్నదని రేవంత్‌రెడ్డి సూచించారు. పెద్దపెద్ద కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడికన్నా రెండేకరాల్లో పంట పండిస్తే అంతకన్నా ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. ఒకప్పుడు చెప్పులు కుట్టడం నామోషీగా ఉండేదని, కానీ ఇప్పుడు అదే ప్యాషన్ అయిపోయిందని తెలిపారు. బ్యూటీ పార్లర్స్, టైలరింగ్, సెలూన్లు ఇవన్నీ యువతకు ఉపాధి మార్గాలుగా మారాయని చెప్పారు. తమ బంధువులు, తుమ్మల నాగేశ్వరరావు బంధువులు బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారని గుర్తుచేశారు. అధికారంలోకి రాకముందు యేటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఊకదంపుడు ఉపాన్యాసాలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అదే యువతకు బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, టైలరింగ్‌ను ఉపాధి మార్గంగా ఎంచుకోవాలని చెప్పడం గమనార్హం.

సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగానే సభలో కనిపించిన ఖాళీ కుర్చీలు
రైతుభరోసా నిధులను సీఎం ఆదివారం విడుదల చేశారు. తొలుత రైతులందరికీ ఎకరం భూమికి రూ.3,590 కోట్లు జమ చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఈ నిధులు ఖాతాల్లో జమవుతాయని చెప్పారు. మిగిలిన నిధులను 45 రోజుల్లో జమ చేస్తామని వివరించారు. మొత్తం 70 లక్షల మంది రైతులకు రూ.9 వేల కోట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. నిధుల కొరత కారణంగానే రైతుభరోసా పంపిణీ ఆలస్యమవుతున్నదని పాతపాటే పాడారు. అయితే ఇదే ప్రభుత్వం రైతుభరోసా కోసమని గత నెలలో రూ.9 వేల కోట్లను ఆర్బీఐ వద్ద అప్పుగా తీసుకున్నది. మరి ఆ డబ్బులు ఎటు పోయాయని, ఎవరికి ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రైతు భరోసా కోసం అప్పు తీసుకున్న తర్వాత మళ్లీ నిధుల కొరత ఎందుకు వచ్చిందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
‘ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఎన్నికలు అయిపోయాక అభివృద్ధి గురించి ఆలోచించాలి. మేం ఇద్దరం సమన్వయం చేసుకుంటే అభివృద్ధి జరుగుతది’ అని బీజేపీ ఎంపీని ఉద్దేశించి ఇదే వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా బీజేపీతో కలిసే పనిచేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు.