హైదరాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ) : మేడారంలో పెట్టిన క్యాబినెట్ మీటింగ్ ఎంత మేలు చేస్తుందో చెప్పలేం కానీ.. రేవంత్‌రెడ్డి మంత్రివర్గ సభ్యులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా కాపాడినట్టు తెలుస్తున్నది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటారనే అనుమానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వల్ప వ్యవధిలో సమావేశాన్ని ముగించినట్టు తెలిసింది. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సీఎం అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ముందే మైక్ అందుకున్న సీఎం.. సమ్మక్క-సారక్క తల్లుల సమక్షంలో రాజకీయ అంశాలు చర్చకు వద్దని, మీడియాలో వచ్చిన కథనాలపై త్వరలో వేరొక చోట చర్చిద్దామని వేడుకోవడంతో మంత్రులు కూడా వెనక్కి తగ్గినట్టు తెలిసింది. అనంతరం 18 అంశాల మీద సుదీర్ఘంగా కొనసాగుతుందనుకున్న సమావేశం కేవలం 1.20 గంటల్లోనే ముగించినట్టు తెలిసింది.
మంత్రుల వివాదాలు ముదరకుండా..
మంత్రి కోమటిరెడ్డిపై ఓ మీడియా లైంగిక ఆరోపణ కథనం ప్రసారం చేయడం, దీని వెనుక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారని మరో మీడియా అధిపతి కథనాలు కాంగ్రెస్‌లో చీలిక తెచ్చినంత పనిచేశాయి. తనకు జరిగిన అవమానంపై సమావేశంలోనే తేల్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి సిద్ధమైనట్టు తెలిసింది. అవసరమైతే రాజీనామా అంశాన్ని ప్రస్తావించేందుకు సిద్ధమై వెళ్లినట్టు తెలిసింది. అదే సమయంలో సీఎంతో సన్నిహితంగా ఉండే మీడియా అధిపతి పత్రికలో తన వ్యక్తిత్వ హననం చేస్తూ కథనం రావడంపై భట్టి విక్రమార్క సీరియస్‌గా ఉన్నారు.
ఇది రేవంత్‌రెడ్డికి తెలిసే రాసిన కథనంగా భట్టి భావిస్తున్నట్టు తెలిసింది. ఇక మేడారం జాతర పనులు తన వర్గానికి దక్కకుండా మంత్రి పొంగులేటి తీసుకున్నారని మంత్రి సురేఖ కోపంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు అంశాల మీద మంత్రివర్గ సమావేశంలో వాడివేడి చర్చ జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావించారు. మంత్రుల ఆగ్రహాన్ని సీఎం గుర్తించి వ్యక్తిగత రాజకీయాలను మరో వేదిక మీద మాట్లాడుకుందామనడంతో మంత్రులు వెనక్కి తగ్గినట్టు తెలిసింది.