హైదరాబాద్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిషరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. గ్రీన్ చానల్ ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున అందజేస్తామని చెప్పారు. తొలి ఏడాది సొంత స్థలం ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేస్తామని, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య సిబ్బంది, దళితులు, గిరిజనులు, వితంతువులు, ట్రాన్స్జెండర్లకు ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
ఐటీడీఏల పరిధిలోని గిరిజనుల కోసం ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ప్రత్యేక కోటా ఇస్తామని తెలిపారు. ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి నమూనా సూచించడం లేదని, ప్రతి మండల కేంద్రంలో మాడల్ హౌజ్ నిర్మిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సైతం వినియోగిస్తున్నామని, పునాది నుంచి స్లాబు వరకు ప్రతి దశలోనూ సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించి అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం గతంలో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. సచివాలయంలో డిసెంబరు 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తోపాటు ఎంఐఎం, సీపీఐ, ఇతర ప్రతిపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్టు సీఎం తెలిపారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కలిసి ఆహ్వానిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రవాణాశాఖ నూతన లోగోను, తెలంగాణ ఆర్టీసీ బ్రోచర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకపత్రాలను ఆయన అందించారు. స్క్రాపింగ్ పాలసీ విధానాన్ని కూడా సీఎం ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కాలుష్య నివారణ కోసం మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను నడిపేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని, అందులో భాగంగా దశలవారీగా 2,400 ఎలక్ట్రిక్ నూతన బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
డీజిల్, పెట్రోల్ ఆటోలను అవుటర్ రింగ్ రోడ్డు అవతలికి పరిమితం చేస్తామని, డీజిల్ బస్సులను జిల్లాలకు తరలిస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా రిజిస్ట్రేషన్ ఫీజులను ఎత్తివేసినట్టు ముఖ్యమంత్రి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.