హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని నిలబెట్టుకున్నదని, వాటికి తోడు రైతు రుణ మాఫీ వాగ్దానాన్ని కూడా అమలు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రైతు రుణ మాఫీ ప్రక్రియను ముఖ్యమంత్రి గురువారం సాయంత్రం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని రైతువేదికల వద్దనున్న అన్నదాతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. 2022 మే 6వ తేదీన వరంగల్ డిక్లరేషన్‌లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రకటించారని, 2023, సెప్టెంబర్ 17న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలతోపాటు రైతు రుణమాఫీ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. హామీని మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో నిలబెట్టుకున్నామని చెప్పారు. తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది మరుపురాని రోజని వివరించారు.
కాంగ్రెస్ మాటి స్తే శిలా శాసనమని, అందుకు రుణమాఫీనే ని దర్శనమని అభివర్ణించారు. మిగులు రాష్ట్రం గా ఏర్పడిన తెలంగాణలో పదేండ్ల్లు అధికారం లో ఉన్న కేసీఆర్ రైతు రుణమాఫీ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. మొత్తంగా పదేండ్లలో రూ.21 వేల కోట్లకు మించి రుణ మాఫీ చేయలేదని, కానీ కాంగ్రెస్ సర్కార్ ఒకే దఫా ఆగస్టు నెల పూర్తికాక ముందే రైతుల రు ణాలు రూ.31 వేల కోట్లను మాఫీ చేస్తున్నదని వివరించారు. రుణమాఫీకి పాస్బుక్కే ప్రమాణికమని, అపోహలను నమ్మవద్దని స్పష్టం చేశారు.
రుణమాఫీకి రేషన్‌కార్డు ఉండాలనే అపోహను కొందరు సృష్టిస్తున్నారని, అవేవీ నమ్మవద్దన్నారు. రేషన్‌కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమేనని, రుణమాఫీకి అది ప్రాతిపదిక కాదని, పాస్బుక్కే ప్రా మాణికమని నొక్కిచెప్పారు. భూమి ఉండి, ఆ భూమికి పాస్‌బుక్ ఉండి, పాస్‌బుక్‌పై రుణం తీసుకుంటే దానిని మాఫీ చేస్తామని వివరించారు. ఈ విషయంపై అవగాహన కల్పించాల ని అధికారులను కోరారు. రుణమాఫీకి సం బంధించి విద్య లేని, సాంకేతిక నైపుణ్యం లేని రైతులెవరికైనా సమస్యలు తలెత్తితే బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు ఖాతాల్లోకి రుణ మాఫీ సొమ్ము చేరేలా చూడాలని కోరారు. గత ప్రభుత్వం జీతాలే సరిగా ఇవ్వలేకపోయిందని, ఆర్థిక ఇబ్బందులున్నా 8 నెలల కాలంలోనే తాము రూ.29 వేల కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు రుణ మాఫీ చేశామని అన్నారు.

రైతు రుణమాఫీ హామీ ఇచ్చి నిలుపుకున్నందున కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గేలకు ధన్యవాదాలు తెలపాల్సిన అవసరమున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రుణమాఫీ హామీ ఇచ్చిన వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలోనే కృతజ్ఞత సభ పెడతామని, ఆ సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానించి, రాష్ట్ర రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతామని వెల్లడించారు. అనంతరం రూ.లక్ష రుణ మాఫీ పొందిన 10 మంది రైతులకు సీఎం చెకులను అందజేశారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తొలి దఫాలో రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేసింది. ఈ మేరకు 11.50 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ. 6098.93 కోట్లను బ్యాంకులకు విడుదల చేసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా రైతులు ప్రయోజనం పొందారు. ఈ జిల్లాలో రూ.లక్ష వరకు రుణం ఉన్న 83,124 మంది రైతులకు రూ. 454.49 కోట్లు మాఫీ అయింది. ఆగస్టు 15వ తేదీలోపు రూ. 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రూ. లక్షన్నర రుణాలను ఈ నెలాఖరు వరకు, రూ. 2 లక్షల వరకు గల రుణాలను ఆగస్టు మొదటి వారంలో మాఫీ చేస్తామని ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ సంబురాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన రైతువేదికలు వేదికయ్యాయి. నాడు రైతువేదికలు ఎందుకు, ఇవి ఏ మాత్రం ఉపయోగపడవని విమర్శించిన వారే నేడు వాటి వద్ద సంబురా లు జరుపుకొన్నారు. రుణమాఫీ సందర్భంగా ఆయా గ్రామాల్లోని రైతు వేదికల్లో సంబురాలు నిర్వహించాలని ప్రభు త్వం అధికారులకు ఆదేశాలు జారీచేసిం ది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులు రైతువేదికల్లో ని ర్వహించిన రుణమాఫీ సంబురాల్లో రైతులతో కలిసి పాల్గొన్నారు. ఏఈవోలు ఎం పిక చేసిన రైతులను రైతు వేదికలకు తరలించారు. కేసీఆర్ కట్టించిన సచివాల యం నుంచే సీఎం వీసీ నిర్వహించారు.
కొల్లాపూర్: రుణ మాఫీ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలోని రైతువేదిక వద్దకు వచ్చిన మహిళా రైతు వసంతపురం రాములమ్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తడబాటుకు గురై ప్రభుత్వాన్ని పొగడటానికి బదులు కంగారులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ ఆదాయం పోయిందని అన్నారు. ఆ వెంటనే తేరుకున్న రాములమ్మ తాను తీసుకున్న రూ. 60 వేల రుణం మాఫీ చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. తనకున్న ఎకరం పొలంలో వరి, వేరుశనగ సాగు చేస్తున్నట్టు సీఎంకు వివరించింది. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు.