KTR | ఐరెన్ లెగ్ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌కు గుండుసున్నా తీసుకొచ్చిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సెటైర్లు వేశారు. తెలంగాణ భవన్లో వికారాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి.. ఢిల్లీలో ముగించాడని.. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా కొనసాగిస్తాడన్నారు. రాహుల్ గాంధీ దేశంలో బీజేపీని గెలిపిస్తూ వస్తున్నాడని.. ఈ దేశంలో నరేంద్ర మోదీ, బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనేనన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధుకు రాం రాం అని కేసీఆర్ ముందే చెప్పారని.. ఆయన హెచ్చరించినట్లుగా రైతుబంధుకు రాం రాం అయ్యిందని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు తిడుతున్న తిట్లు రేవంత్ రెడ్డి వింటే తట్టుకోలేడన్నారు. సంవత్సరంలోపే కాంగ్రెస్ పార్టీ దగాకోరు నైజాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారన్నారు. పట్నం మహేందర్ రెడ్డి వెన్నుపోటు కారణంగానే.. మెతుకు ఆనంద్ ఓడిపోయారని.. మోసగాళ్లంతా పార్టీ నుంచి వెళ్లిపోయారన్నారు. ప్రస్తుతం నిఖార్సయిన కార్యకర్తలు, నాయకులు మాత్రమే పార్టీలో మిగిలారన్నారు.
రేవంత్‌రెడ్డి సూచనలతోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను నడుపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైక్ ఇవ్వడం లేదని.. ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మైకివ్వడానికి వణికిపోతున్నాడన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫుట్‌బాల్ ఆడుతున్నారన్నారు. వందశాతం రుణమాఫీ జరిగిందని ఏ ఒక్క ఊరిలోనైనా రైతులు చెబితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అసెంబ్లీ చెప్పానని.. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. 25శాతం కూడా రాష్ట్రంలో రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీ కోసం రూ.49,500 కోట్ల కావాలన్నారు.
వికారాబాద్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్
ప్రెస్మీట్లో సీఎం రేవంత్ రూ.40వేలకోట్ల రుణమాఫీ అని తప్పుడు లెక్కలు చెప్పారని విమర్శించారు. కేబినెట్లో రూ.31వేల కోట్ల రుణమాఫీ అన్నారని.. అసెంబ్లీ బడ్జెట్లో రూ.26వేలకోట్లు అన్నారని.. మహబూబ్‌నగర్ మీటింగ్‌లో రుణమాఫీ మొత్తం చేశానని రూ.18వేకోట్లు ఇచ్చారని సీఎం చెప్పిండని ఆరోపించారు. ఇప్పటి వరకు రూ.11వేలకోట్లు రైతుల ఖాతాల్లో పడలేదని భట్టి విక్రమార్క నిజం చెప్పారన్నారు. రూ.49వేల కోట్లుగా చెప్పిన రుణమాఫీ రూ.11వేలకోట్లకు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. చారానా కూడా కాలేదని.. తెలంగాణవ్యాప్తంగా రైతులంతా రేవంత్‌రెడ్డిని పొట్టుపొట్టు తిడుతున్నారన్నారు. సెక్యూరిటీ లేకుండా రేవంత్‌రెడ్డి పల్లెలకుపోతే రైతులు దంచికొట్టేలా ఉన్నారన్నారు.
కేసీఆర్ ఉంచిన పైసలనే అధికారంలోకి వచ్చాక రైతుభరోసాలాగా రేవంత్‌రెడ్డి ఇచ్చిండని కేసీఆర్ మండిపడ్డారు. అవే పైసల్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్లే ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసి రైతుల ఖాతాల్లో పడకుండా చేశారన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు రైతులకు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ఇవ్వలేదన్నారు. టకి టకీ మని రైతు భరోసా పైసలు పడతాయని రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ ఒక రూపాయి రాలేదన్నారు. టకి టకీ మని తులం బంగారం పడలేదన్నారు. టకీ టకీ మని ఆడవాళ్లకు రూ.2500 సహాయం అందలేదన్నారు. టకి టకిమని వృద్ధులకు రూ.4వేల పెన్షన్లు కూడా పడలేదన్నారు. వికారాబాద్ ప్రజలు మంచివారని కేటీఆర్ అన్నారు.