కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాహుల్-రేవంత్(ఆర్ఆర్) ట్యాక్స్ వసూళ్ల కారణంగా రాష్ట్రంలో రియల్ఎస్టేట్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వచ్చింది. బిల్డర్లను బెదిరించి స్కేర్ ఫీట్‌కు ఇంత అని రేట్ ఫిక్స్ చేసి, భారీగా ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతున్నారు. అందుకే పెట్టుబడులకు బిల్డర్లు ముందుకురావడం లేదు.
– కేటీఆర్
రంగారెడ్డి, జూన్ 25(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రియల్ఎస్టేట్ రంగం కుప్పకూలడానికి ‘ఆర్ఆర్’ ట్యాక్సే ప్రధాన కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నలుమూలలా అనేక కంపెనీలు ఏర్పాటు చేయడంతో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని గుర్తుచేశారు. అప్పుడు రియల్ఎస్టేట్ అమాంతం పుంజుకొని, ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది లబ్ధిపొందారని చెప్పారు.
ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అనేక విదేశీ కంపెనీ ఏర్పాటుకావడంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ఒకప్పుడు షాబాద్‌లో భూములు కొనేందుకు ఎవరూ రాలేదని, కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన కంపెనీల కారణంగా ఎకరం విలువ రూ.కోట్లకు చేరిందని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో గురువారం ఎస్ఐఆర్, బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని ధ్వజమెత్తారు.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై ఏ రంగం కూడా సంతృప్తిగా లేదని కేటీఆర్ మండిపడ్డారు. రైతుబంధు ఇవ్వకపోటంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు కరెంటు కోతలతో వ్యవసాయరంగం అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేయటంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఐదేండ్లలో బీసీలకు రూ.లక్ష కోట్లు, మైనారిటీలకు బడ్జెట్లో రూ.4వేల కోట్లు ఇస్తామనే హామీని పూర్తిగా విస్మరించిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ చెప్పే అబద్ధాలతో ఆగం కావద్దని, ఆ ప్రభుత్వాన్ని గెలిపించిన మీరే ఓడించే బాధ్యత కూడా తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
రాష్ట్రంలో రెండున్నరేండ్లలో రూ.4లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారో చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డి సమాధానాం చెప్పాలని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉండగా చేసిన అప్పులతో ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు కృషిచేసిందని పేర్కొన్నారు. పింఛన్ల పెంపు, రైతుబంధుకు నిధులు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద నిరుపేద ఆడబిడ్డలకు ఆర్థికసాయం, 24గంటల ఉచిత విద్యుత్, పరిశ్రమల ఏర్పాటు సీఎం సహాయనిధి, దళితబంధు పథకం కింద వెనుకబడిన వారికి ఆర్థికసాయం, బీసీబంధు, రెసిడెన్షియల్ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు కొత్తగా అనేక సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటుచేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి రైతుబంధు నిలిపివేసిందని, కల్యాణలక్ష్మీ పథకం కింద ఇస్తామన్న తులం బంగారం ఇవ్వలేదని, ప్రతి మహిళకూ రూ.2,500 ఇస్తామన్న హామీని కూడా విస్మరించిందని కేటీఆర్ దుయ్యబట్టారు. అదీగాక కాంగ్రెస్ వచ్చాక సాగునీటి రంగం కూడా పూర్తిగా కుదేలైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో అనేక ప్రాజెక్టుల రూపకల్పనకు శ్రీకారం చుట్టి డీపీఆర్ సిద్ధం చేసి నిధులు విడుదల చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నదని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని వారు కోరుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించి తప్పుచేశామని ప్రజలు పశ్చాతాప పడుతున్నారని అందుకే అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చి ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని తెలిపారు.
అందుకే రాష్ట్రమంతటా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని కేటీఆర్ ధీమాగా చెప్పారు. రేవంత్‌రెడ్డి మాటల మనిషి అని ప్రజలు గ్రహించారని, అబద్ధాలు, డైలాగ్‌లతో మోసంచేసే కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తి చేశారు.
వచ్చే ఎన్నికల్లో జరిగే ధర్మయుద్ధంలో కాంగ్రెస్, బీజేపీలకు గెలిచే పరిస్థితి లేకనే కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ‘సర్’ను అడ్డు పెట్టుకొని బీజేపీ పెద్ద ఎత్తున ఓటర్ల ఏరివేతకు సిద్ధమైందని, అందులో భాగంగానే ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్, బీహార్ వంటి రాష్ర్టాల్లో అక్రమంగా అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
మన రాష్ట్రంలో కూడా వచ్చే నెల 24వరకు జరుగనున్న ఓటర్ల వడబోత కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్వోలకు సహకరిస్తూ బీఆర్ఎస్ ఓటర్లు పోకుండా చూడాలని చెప్పారు. ప్రస్తుతం జరిగే ఓటర్ల వడపోతలో ఎలాంటి అభ్యంతరాలున్నా ఫిర్యాదులు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, పార్టీ నాయకులు అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.