మయామి: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి బాధ తర్వాత అర్జెంటీనా సాకర్ లెజెండ్ లియోనల్ మెస్సీ మైదానంలో మళ్లీ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఫిఫా కప్ ముగిసిన అనంతరం లీగ్స్ కప్‌లో ఇంటర్ మయామి క్లబ్ తరఫున బరిలోకి దిగిన మెస్సీ తన రెండో మ్యాచ్‌లో డబుల్ గోల్స్‌తో మ్యాజిక్ చేశాడు.
దాంతో ఇంటర్ మయామి టీమ్ 4-2తో అట్లెటికో సాన్ లూయిస్‌పై విజయం సాధించింది. బుధవారం రాత్రి వర్షం అంతరాయం కలిగించిన ఈ పోరులో 11వ నిమిషంలోనే తొలి గోల్ కొట్టిన మెస్సీ.. 44వ నిమిషంలో మరోసారి బంతిని నెట్లోకి పంపించాడు. దాంతో ఈ టోర్నీలో మెస్సీ కొట్టిన గోల్స్ సంఖ్య 14కు (12 మ్యాచ్‌ల్లో) చేరింది. ఫలితంగా నాలుగేండ్ల ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా లాస్ ఏంజెల్స్ ఎఫ్‌సీ ప్లేయర్ డెనిస్ బౌంగా (13 గోల్స్) రికార్డును అర్జెంటీనా లెజెండ్ బ్రేక్ చేశాడు.