హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.3000 కోట్ల అప్పు తెచ్చింది. ఎఫ్ఆర్బీఎం పరిధిలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నుంచి ఈ మొత్తాన్ని సేకరించింది. రూ.1000 కోట్ల విలువైన మూడు బాండ్లను 24 సంవత్సరాలు, 29 సంవత్సరాలు, 30 సంవత్సరాల కాలానికి రాష్ట్ర ఆర్థికశాఖ ఆర్బీఐకి జారీచేసింది. మంగళవారం జరిగిన వేలం లో పాల్గొని రూ.3,000 కోట్ల రుణం పొందింది. ఈ విషయాన్ని ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్ఆర్బీఎం పరిమితిని కేంద్ర ప్రభుత్వం 49,255 కోట్లకు విధించగా, రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మూడు త్రైమాసికాల్లో రూ.40,909 కోట్ల రుణం పొందింది.
చివరి త్రైమాసికంలో ఆర్బీ ఐ నుంచి మరో రూ.30 వేల కోట్లు సేకరించేందుకు ఇండెంట్ పెట్టింది. మంగళవారం రూ.3000 కోట్లు తీసుకోగా, ఈ నెల 14న రూ.2000 కోట్లు, ఈ నెల 21న రూ.2500 కోట్లు, ఈ నెల 28వ తేదీన మరో రూ.2500 కోట్లు సేకరించనున్నది. అంటే మొత్తం రుణం రూ.70,909 కోట్లకు చేరనున్నది. ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అదనంగా రూ.21,654 కోట్లు సేకరించనున్నది.