హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీబస్ పథకంతో మెట్రో ఆదాయానికి గండిపడుతున్నదని, ఇది ఇలాగే కొనసాగితే నిర్వహణ కష్టమని, కాబట్టి ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంటామంటూ ఎల్అండ్టీ సంస్థ ప్రెసిడెంట్, సీఎఫ్‌వో ఆర్ శంకర్రామన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేలిగ్గా తీసుకున్నారు. మెట్రోను అమ్ముకోవాలంటే అమ్ముకోవచ్చని, వారి ఆస్తిని వారు అమ్ముకుంటామంటే అడ్డుకునేందుకు తామెవరిమని ప్రశ్నించారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో సీఎం చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ముచ్చటించారు. కరెంట్ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఒక మెకానిజం ఏర్పాటు చేశారని ఆరోపించారు. కరెంట్ విషయంలో కావాలనే కొందరు అధికారులు తప్పుడు విధానాలు అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎన్నికల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని చూశారని, కొందరిని గుర్తించి కేసులు కూడా నమోదు చేసినట్టు చెప్పారు.
ఎన్నికలు, రాజకీయాలు ముగిశాయని, ఇకపై తమ దృష్టి మొత్తం పాలనపైనే పెడతామని స్పష్టం చేశారు. బుధవారం నుంచి సచివాలయానికి వెళ్తానని, విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. ఇక నుంచి రాజకీయ విమర్శలను పట్టించుకోబోనని, పరిపాలనపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తానని స్పష్టం చేశారు. తొలుత రైతుల రుణమాఫీపై దృష్టి పెట్టనున్నట్టు చెప్పారు. అందుకోసం ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే రుణం తీసుకుంటామని, బ్యాంకులకు ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి రుణం బదిలీ చేసుకుంటుందని తెలిపారు. ధరణిపై కమిటీ రిపోర్టు ఆధారంగా ముందుకు వెళ్తామని, అసెంబ్లీలో చర్చించకుండా ఏ నిర్ణయమూ తీసుకోబోమని స్పష్టం చేశారు. అఖిలపక్షంతో చర్చించాకే పాలసీలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతులకు పెట్టుబడి, పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో స్కూళ్లు, ఫీజులపై దృష్టి సారిస్తామని, హాస్టళ్లలో సన్నబియ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమిస్తామని తెలిపారు.
రైతుల పంటలను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి తకువ ధరకు రేషన్‌షాపుల్లో పేదలకు అందించే ఆలోచన చేస్తున్నట్టు రేవంత్‌రెడ్డి తెలిపారు. రేషన్‌షాపులను గత ప్రభుత్వం బియ్యానికి మాత్రమే పరిమితం చేసిందని, ఇక పై రైతుల నుంచి కొనుగోలు చేసి 9 రకాల వస్తువులను పంపిణీ చేస్తామని వివరించారు. సన్నబియ్యం కూడా ఇస్తామని తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు వెంటనే చర్యలు తీసుకుంటామని, కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉం టే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అనేది ముగిసిన అధ్యాయమని సీఎం స్పష్టం చేశారు. నగరం యూటీ అవుతుందని ఎవరైనా ప్రచా రం చేస్తే అది తెలివి తక్కువ తనమే అవుతుందని మండిపడ్డారు.వరంగల్‌ను హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. హుస్సేన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు గోదావరి జలాలు నిత్యం వచ్చేలా చేస్తామని వివరించారు. ఫార్మాసిటీలను విస్తరిస్తామని, ఫార్మా కంపెనీలన్నీ ఒకే దగ్గర ఉంటే సిటీ విడిచి పెట్టి వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. మూసీని ఒక ఆదాయ వనరుగా వాడుకుంటామని రేవంత్ చెప్పారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో ముందుకే వెళ్తామని, అంతకంటే ముందు మం డలాలు, రెవెన్యూ డివిజన్లను క్రమబద్ధీకరిస్తామని రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని విమర్శించారు. కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌ను, ఒక్క నియోజకవర్గం ఉన్న వనపర్తిని కూడా గత ప్రభుత్వం జిల్లాగా చేసిందని విమర్శించా రు. పాలమూరుపై ప్రత్యేక దృష్టి పెడతామని, ప్రాజెక్టులు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.