యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 23: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం ఆరో రోజు యాదగిరీశుడు గోవర్ధన గిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చాడు. కుడి చేతి లో పిల్లనగ్రోవి, ఎడమ చేతి చిటికెన వేలిపై గోవర్ధన పర్వతం ఎత్తిన స్వామివారిని పట్టు పీతాంబరాలతో ఆలంకరించి ప్రధానాలయ తిరు వీధుల్లో ఊరేగించారు. ఉత్సవ మండపంలో చతుర్వేదాలు, మూలమంత్రాలు, మూర్తి మంత్రాలు, హోమాలు, సుదర్శన మహామంత్రం, నారసింహ మహామంత్రం, పంచ సూక్తాలు, నిత్య లఘు పుర్ణాహుతి, నిత్య పుర్ణాహుతి, వేదాలు, పారాయణాలు, ఇతిహాసాలు గావించారు. పంచసూక్తాలు, ఉపనిషత్తులు పఠిస్తూ రుత్వికులు అర్చకులు ముందు నడుస్తుండగా, భక్తుల గోవింద నామస్మరణ మధ్య వైభవంగా తిరువీధి సేవ సాగింది. తూర్పు తిరు మాడ వీధుల్లో ప్రత్యేక మండపంలో స్వామివారిని ఆస్థానం చేశారు. స్వామివారి అలంకారమైన నాలుగు వేదాలు, గోవర్ధన గిరిధారి సూక్తులను పఠించారు. దివ్య ప్రబంధంలోని అలంకార వైభవ ప్రాశురాలను పఠిస్తూ స్వామివారి అలంకార విశిష్టతను ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు వివరించారు.
సింహవాహనరూఢుడైన స్వామి
స్వామివారికి రాత్రివేళ దివ్యవాహన సేవ సంప్రదాయం కొనసాగింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు నృసింహస్వామిగా అవతరించిన స్వామివారు రాత్రి సింహ వాహనంపై యోగానంద నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టువస్ర్తాలు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో తేజోరూపుడైన నారసింహుడు ఆటవికి రాజైన సింహ వాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. రుత్వికుల పారాయణాలు, మంగళవాయిద్యాల మధ్య ప్రధానాలయ తిరుమాడ వీధుల్లో స్వామివారు ఊరేగారు. స్వామివారు సింహ వాహనరూ ఢుడై భక్తులకు దర్శనమిచ్చిన తీరు ఎంతో విశేషమైందని, సింహం కార్యదీక్ష, బుద్ధికుశలత, పరాక్రమం, ధైర్యం, గాంభీర్యాది గుణాలకు ప్రతీక అని ప్రధానార్చకులు కండూరి వేంకటాచార్యులు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆల య అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్, కలెక్టర్ హనుమంతరావు, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యు లు, భట్టర్ సురేంద్రాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, ఉప కార్యనిర్వహణాధికారులు తదితరులు పాల్గొన్నారు.
నేడు స్వామి వారి ఎదుర్కోలు
నారసింహుడి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం జగన్మోహిని అవతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవలో స్వామివారు ఊరేగనున్నారు. అనంతరం రాత్రి 8.45 గంటలకు స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
