హుబ్బలి: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి హుబ్బలి వేదికగా కర్ణాటక, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య తుది పోరు జరుగనుంది. సుదీర్ఘ టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన కశ్మీర్..ఎనిమిది సార్లు చాంపియన్ కర్ణాటక అమీతుమీ తేల్చుకోనున్నాయి. సొంత ఇలాఖాలో మ్యాచ్ జరుగుతుండటం కర్ణాటకకు కలిసొచ్చే అంశం కాగా, కశ్మీర్ దీటైన పోటీనిచ్చేందుకు పట్టుదలతో ఉంది. ఈ సీజన్లో కర్ణాటక, కశ్మీర్ జట్లు అంచనాలకు మించి రాణించాయి.
టోర్నీలో తొలుత సౌరాష్ట్రతో మ్యాచ్‌లో తడబడ్డ కర్ణాటక టీమ్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. టైటిల్ ఫెవరేట్లలో ఒకటైన ముంబైతో పాటు కేరళ, చండీగఢ్, పంజాబ్ లాంటి జట్లను ఓడించిన కర్ణాటక సమష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. ముఖ్యంగా మయాంక్ అగర్వాల్ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న దేవదత్ పడిక్కల్ సూపర్ ఫామ్మీదున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో పడిక్కల్ 66.50 సగటుతో 532 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ (457), కరణ్ నాయర్ (699), రవిచంద్రన్ స్మరణ్ (950) పరుగుల వరద పారిస్తున్నారు.
వీరికి తోడు ఆల్‌రౌండర్ శ్రేయాస్ గోపాల్ 46 వికెట్లతో పాటు 442 పరుగులు సాధించి విలువ చాటుకున్నాడు. పేస్ దళానికి ప్రసిద్ధ్ కృష్ణ నాయకత్వం వహిస్తుండగా, విద్వత్ కావేరప్ప, విద్యాదర్ పాటిల్, వైశాక్ విజయ్‌కుమార్, శిఖర్ శెట్టి, మోహిసిన్ ఖాన్ మంచి టచ్‌లో ఉన్నారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ టీమ్ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ టైటిల్ పోరులో నిలిచింది. ఈ క్రమంలో బెంగాల్, మధ్యప్రదేశ్ లాంటి జట్లను కశ్మీర్ కంగుతినిపించింది. యువ పేసర్ అకిబ్ నబీ 55 వికెట్లతో దుమ్మురేపుతున్నాడు. వెటరన్ పరాస్ డోగ్రా, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ రాణిస్తే తొలిసారి రంజీ టైటిల్ ఖాతాలో చేరినట్లే