Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తేతెలంగాణ) : ‘మేము అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే తెలంగాణలో 22,22, 067 మంది రైతులకు రూ.17, 869.22 కోట్ల మేర రుణమాఫీ చేశాం’ అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ‘తెలంగాణలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చినా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు’ అంటూ ఈనెల 5న మహారాష్ట్రలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మోదీ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ రేవంత్‌రెడ్డి రాసిన లేఖను ఆదివారం ఎక్స్ వేదికగా విడుదల చేశారు. ‘మీరు చేసిన ప్రకటన వాస్తవికతను ప్రతిబింబించనందున నేను బాధపడ్డాను.. ఆశ్చర్యపోయాను’ అంటూ లేఖలో వాపోయారు. రుణమాఫీ కోసం బడ్జెట్లో రూ. 26 వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.
అవసరమైతే రూ.31 వేల కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రస్తావించారు. మొదటి విడుతలో రూ.2 లక్షల వరకు మాఫీ చేశామని, మరో విడుతలో రూ.2 లక్షలకు పైగా లోన్లను మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల్లో రుణమాఫీకి అగ్ర ప్రాధాన్యమిచ్చామని, రుణమాఫీ ద్వారా తమ అంకితభావాన్ని చాటుకున్నామని తెలిపారు. ‘ప్రధానమంత్రి గారూ తెలంగాణ రైతుల ఆత్మస్థయిర్యాన్ని తగ్గించే బదులు..ఇద్దరం కలిసి పెంపొందించేందుకు ప్రయత్నిద్దాం’ అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు మోడల్‌గా నిలుస్తున్నదని, తెలంగాణ అభివృద్ధి, రైతు సంక్షేమానికి సహకారం కావాలని లేఖలో ప్రస్తావించారు.