హైదరాబాద్, జులై 8(నమస్తే తెలంగాణ): పాడిందే పాడరా.. అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ తీరు రోత పుట్టిస్తున్నది. కాళేశ్వరం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు తనకు అలవాటైన డైవర్షన్ రాజకీయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ తెరపైకి తెచ్చారు. ‘ధరణిలో అక్రమాలపై ఫోరెన్సిక్ నివేదిక అందింది’ అంటూ కొత్త నాటకానికి శ్రీకారంచుట్టారు. ఓవైపు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేయడం, నివేదికపై అనుకూల మీడియాకు లీకులిస్తూ సర్కార్ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నది. కరువును జయించే కాళేశ్వరం జలాలను ఎత్తిపోయకుండా రైతులను గోస పుచ్చుకొంటున్న సర్కార్‌పై ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాన్ని, చేతగానితనాన్ని ఎండగడుతున్నది. ప్రజలు సైతం వాస్తవాలను గ్రహించి కాంగ్రెస్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రైతులతో, సాగునీళ్లతో రాజకీయాలు ఏంటంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మరింతగా ప్రజల్లోకి వెళ్తే భారీ నష్టం తప్పదనే ఆందోళన సీఎంలో మొదలైంది. అందుకే ధరణి మళ్లీ తెరపైకి వచ్చింది.
ఫోరెన్సిక్ నివేదిక.. ఓ డ్రామా
ధరణిలో అనేక అక్రమాలు జరిగాయంటూ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉండగా అవే ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఇప్పటివరకు ధరణికి సంబంధించి నాడు ప్రతిపక్షంలో చేసిన ఆరోపణలను ఇప్పటివరకు నిరూపించలేదు. చెప్పినట్టుగానే ధరణిని బంగాళాఖాతంలో పడేసినట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఓవైపు కమ్ముకొస్తున్న కరువు, మరోవైపు పనికిరాదని చెప్పిన కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయాల్సిన పరిస్థితి, సర్కార్‌పై రైతుల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం.. అన్నింటి మధ్య సర్కార్‌కు ఊపిరి సలుపని పరిస్థితి ఏర్పడింది. అందుకు ఫోరెన్సిక్ నివేదిక పేరుతో డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి అక్రమాలపై కేరళ సంస్థకు ఫోరెన్సిక్ ఆడిట్‌కు అప్పగించినట్టు ప్రకటించింది. ఆ తర్వాత నివేదిక సైతం ప్రభుత్వ చేతికి అందింది. ఇందులో అక్రమాలేవి గుర్తించలేదని తెలిసింది. అందుకే సర్కార్ పెద్దలు కూడా ఆ నివేదికను పక్కన పెట్టేశారు.
నివేదిక ఎందుకు బయటపెట్టలేదు?
కాళేశ్వరం జలాల కోసం బీఆర్ఎస్ పోరుబాట తీవ్రరూపం దాల్చే సమయానికి.. ఫోరెన్సిక్ నివేదిక అందినట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ నివేదిక ఆధారంగా ధరణి, భూభారతి పోర్టళ్ల అక్రమాలపై ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిందంటూనే కమిటీ వేయాల్సిన అవసరం ఏమిటనే ప్ర శ్నలు వినిపిస్తున్నాయి. ఫోరెన్సిక్ నివేదికలో అవకతవకలు గుర్తిస్తే ఎందుకు బహిర్గతం చేయడం లేదు. సర్కార్ వద్ద ఉన్న ఫోరెన్సిక్ నివేదికను బహిర్గతం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని ఆధారం గా రాజకీయాలు చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేటీఆర్ పర్యటన తెల్లారే లీకులు
ఈ నెల 5న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించారు. వృథాగా పోతున్న నీళ్లను ఎత్తిపోయాలని కాంగ్రెస్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. కేటీఆర్ పర్యటనకు అడుగుగడుగునా సర్కార్ ఆటంకాలు సృష్టించింది. అయినా బీఆర్ఎస్ పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇంకేముందు ఈ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు, ప్రజలు, రైతుల దృష్టిని మరల్చేందుకు ఫోరెన్సిక్లో అక్రమాలు అంటూ సీఎంవో నుంచి అనుకూల మీడియాకు ఈ నెల 6, 7, 8 తేదీల్లో లీకులు జారీ అయ్యాయి. మొదట అక్రమాలంటూ లీకులిస్తే ఆశించిన స్థాయిలో మైలేజీ రాలేదు. దీంతో ఇంకో అడుగు ముందుకేసి ధరణి అక్రమాలపై సీఐడీ విచారణ, సిట్ ఏర్పాటు అంటూ మరో కొత్త కథనాన్ని వండి వార్చేలా లీకులిచ్చినట్టుగా తెలిసింది. సీఐడీ, సిట్ విచారణ అంటే దీనిపై విపరీతమైన చర్చ జరుగుతుందని సర్కార్‌లో ఆశ ఉన్నది. ఈ ప్లాన్ కూడా బెడిసికొట్టింది. ధరణిపై లీకులతో కాళేశ్వరంపై చర్చను పక్కదారి పట్టిద్దామనుకొన్న కాంగ్రెస్ ప్రభుత్వం పప్పులు ఉడకలేదనే చర్చ జరుగుతుంది.
బీఆర్ఎస్ పోరుబాట.. సర్కార్‌కు ఉక్కపోత
ఓవైపు ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకొన్నాయి. మరోవైపు ఎగువ రాష్ర్టాల్లో కురిసిన వర్షాలతో కాళేశ్వరంలోకి వస్తున్న జలాలను ఎత్తిపోసేందుకు కాంగ్రెస్ సర్కార్ ససేమిరా అంటున్నది. పొలాల్లో పారాల్సిన కాళేశ్వరం జలాలు వృథాగా దిగువకే పోతున్నాయి. సాగునీరు లేక అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం పక్షాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. కాళేశ్వరం జలాలను ఎత్తిపోయాలంటూ డిమాండ్ చేస్తున్నది. బీఆర్ఎస్ పోరాటంపై రైతుల్లో చర్చ మొదలైంది. ఇంకేముంది కాంగ్రెస్ సర్కార్‌కు ఉక్కపోత మొదలైంది. తమ సర్కార్ నీళ్లివ్వడంలేదనే అభిప్రాయం రైతుల్లో నాటుకొంటున్నదనే ఆందోళన ప్రభుత్వ పెద్దల్లో మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించి అక్కడి నుంచి దిగువకు వెళ్తున్న జలాలను చూపించి సర్కార్‌ను సూటిగా ప్రశ్నించారు. మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం నీళ్ల లెక్కలతో సర్కార్ వైఖరిని ఎండగడుతున్నారు. కాళేశ్వరం జలాలను ఎందుకు ఎత్తిపోయడం లేదని, రైతులను కరువులో ముంచుతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మేడిగడ్డ నుంచి 91 వేల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయి. వర్షాల్లేక, సాగునీళ్లు కరువై సాగు ముందుకు కదలడంలేదు. అయినా రేవంత్ సర్కార్ తన మొండివాదననే ముందేసుకొంటుంది. కాళేశ్వరంపై మళ్లీ అదే పాత పాటనే పాడుతున్నది.
సీఎంవో లీకులు.. అనుకూల మీడియా రాతలు
‘కాళేశ్వరంపై చర్చను పక్కదారి పట్టించాలి. బీఆర్ఎస్ వాదాన్ని రైతుల్లోకి వెళ్లనీయకుండా చేయాలి’ అనే ఒకే లక్ష్యంతో సీఎంవో రంగంలోకి దిగినట్టుగా తెలుస్తున్నది. ఇందులో భాగంగానే ఉన్నదో? లేదో? వచ్చిందో? లేదో? అక్రమాలు జరిగాయో? లేదో? తెలియని ఫోరెన్సిక్ నివేదికపై సీఎంవో నుంచి లీకులపై లీకులు మొదలయ్యాయి. సర్కార్‌కు వత్తాసు పలికే అనుకూల మీడియాకు సీఎంవో, రెవెన్యూశాఖ వర్గాల నుంచి లీకులు వెళ్లినట్టుగా సమాచారం. ఆ లీకుల ఆధారంగా ధరణిపై అనుకూల మీడియా రోత రాతలను వండివార్చింది. అందుకే అన్ని పేపర్లలో ఒకేరోజు ఒకే విధంగా వార్తలను వండివార్చేలా పక్కా ఏర్పాట్లు చేశారు.