Congress Govt | హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. దీనిపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెప్పారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రివర్గంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది పూర్తిగా అధిష్ఠానం నిర్ణయమేనని, తాను ఎవరి పేరునూ ప్రతిపాదించడం లేదని చెప్పారు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో చట్ట ప్రకారం శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పారు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటుపై రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని కలవకపోవడంపై వస్తున్న విమర్శలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. తాను రాహుల్‌గాంధీ అపాయింట్‌ను కోరలేదని తెలిపారు. తమ మధ్య గల బంధం గురించి తెలియని వారు మాట్లాడే మాటలను పట్టించుకోనని చెప్పారు. పార్టీలో, ప్రభుత్వంలో జరిగే ప్రతి అంశం అధిష్ఠానం దృష్టిలో ఉంటుందని పేర్కొన్నారు. అధిష్ఠానానికి చెప్పి వారి ఆదేశాలు, అనుమతితోనే పలు పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు తెలిపారు. పార్టీలో, ప్రభుత్వంలో ఏకఛత్రాధితప్యం కుదరదని పేర్కొన్నారు.
ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఎమ్మెల్యేల్లో నైరాశ్యం ఆవహించింది. ఆశావాహులు నిరుత్సాహానికి గురయ్యారు. మంత్రి పదవి కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నామని, రేపోమాపో అయిపోతుందని భావించామని, తాజా పరిణామాలతో ఎదురుచూపులు మరికొన్ని రోజులు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇంకెన్నాళ్లు వేచి చూడాలో తెలియడం లేదని, అసలు మంత్రివర్గం విస్తరణ చేస్తారో లేదో అనే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందేమోనని భావించిన ఎమ్మెల్యేలు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు ఇటు పార్టీ రాష్ట్ర నాయకత్వం, అటు జాతీయ నాయకత్వం వద్ద పైరవీలు మొదలుపెట్టారు. తీరా సీఎం మాటలతో వారంతా తీవ్ర నిరాశకు గురైనట్టు తెలిసింది.