CM Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా (రైతుబంధు) పథకం కింద అందరికీ పెట్టుబడి సాయం ఇవ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వ్యవసాయం చేసే రైతులకే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. అప్పుడే ఆ పథకానికి అర్థం ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ రహదారుల కింద భూములు పోయినవారికి, కాలనీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, గుట్టలు, సాగు చేయని భూములకు రైతుబంధు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకం ఉద్దేశం అది కాదని స్పష్టంచేశారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడారు.
‘మండలికి సీఎం క్షమాపణ చెప్పే అంశంలో అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు వచ్చాయి. ఆ విషయాన్ని ఆయన చూస్తారు. నేను మాట్లాడేది తెలంగాణ భాషనే’ అని పేర్కొన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చే అంశం తన దృష్టిలో లేదని, ఎవరైనా వచ్చేందుకు సిద్ధంగా ఉంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆరోగ్య శ్రీ పథకానికి రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. జర్నలిస్టులకు 6 గ్యారెంటీలను అమలు చేయడానికి రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులు ఇవ్వడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
అసెంబ్లీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టినది వాస్తవాల బడ్జెట్ అని, గతంలో అబద్ధాలతో బడ్జెట్ పెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో తెలంగాణ అంటేనే అబద్ధాలు అనే పర్యాయపదం తెచ్చారని విమర్శించారు. తెలంగాణ అంటే నిజమనే అభిప్రాయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మళ్లీ తెచ్చారని అన్నారు. 60 రోజుల్లో బడ్జెట్ అంచనాలు భట్టికి వచ్చాయని, పదేండ్లు అయినా బీఆర్ఎస్వాళ్లకు రాలేదని విమర్శించారు. గత బడ్జెట్ కంటే ప్రస్తుతం రూ.70 వేల కోట్లు తగ్గిందని, అంటే 23 శాతం బడ్జెట్ తగ్గిందని వివరించారు. నీటిపారుదలశాఖలో అప్పులకు వడ్డీలే రూ.16 వేల కోట్లు కట్టాల్సి వస్తున్నదని, గతంలో చేసిన అప్పులకు తమ ప్రభుత్వం ఊరి వేసుకోవాల్సి వస్తున్నదని అన్నారు. రుణమాఫీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, దీని కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. రైతులందరి రుణాన్ని ప్రభుత్వం తీసుకొని వారికి రుణం లేకుండా చేస్తామని, ఆ రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
అసెంబ్లీ బీఏసీ సమావేశానికి పార్టీ పేరు ఇచ్చిన వారే రావాలనే నిబంధన ఉన్నదని సీఎం తెలిపారు. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీఏసీకి తన పేరు, ఎర్రబెల్లి పేరు ఇచ్చినా తనను సమావేశం నుంచి బయటికి పంపించారని చెప్పారు. అప్పుడు హరీశ్‌రావు మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం వస్తే కలుస్తామని చెప్పారు. తనను కలిస్తేనే బీఆర్ఎస్ పార్టీ వారి ఎమ్మెల్యేలను అనుమానిస్తున్నదని ఎద్దేవా చేశారు. పది పైసలతో అయ్యేది పది రూపాయలు ఖర్చుపెడితే అద్భుతం అవుతుందా? అని ప్రశ్నించారు. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల జ్యోతి నిర్మాణం, చెల్లింపులు, అంచనా వ్యయంపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
సభలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం ప్రవేశపెడుతామని సీఎం తెలిపారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ తర్వాత అన్న నిజానిజాలు బయటికి వస్తాయని అన్నారు. మేడిగడ్డ సందర్శనకు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను ఆహ్వానిస్తున్నామని, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆ పనిలోనే ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ నేతలకు మేడిగడ్డకు వెళ్లేందుకు 13న వీలుకాకపోతే మరో తేదీ అడుగుతారా? ఏం చేప్తారు అనేది వాళ్లనే అడిగి నిర్ణయిస్తామని తెలిపారు. మేడిగడ్డకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నామని, ఎవరు వస్తారన్నది బీఆర్ఎస్ ఇష్టమని పేర్కొన్నారు. ‘నీటిపారుదల ప్రాజెక్టులను మూడు భాగాలుగా విభజిస్తాం. ఆరు నెలల్లో పూర్తి అయ్యేవి, మూడు సంవత్సరాల్లో పూర్తి అయ్యేవి, అనవసరంగా చేపట్టిన ప్రాజెక్టులు. అందుకు అనుగుణంగా పనులు చేస్తాం. నిధులు కూడా ఆ విధంగానే కేటాయిస్తాం’ అని వివరించారు.