Padi Kaushik Reddy | సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడటం తప్ప.. ఒక్క పనికూడా చేయడం లేదని పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లకు రేవంత్ రెడ్డి హ్యాక్ చేయిస్తున్నారని ఆరోపించారు. మైహోంభుజాలో ఏ హీరోయిన్ దగ్గరకు వెళ్లావో కూడా మాకు తెలుసని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. నువ్వు తిరిగిన 16 మంది విషయాలు కూడా తెలుసని స్పష్టం చేశారు. ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డిపై ఈడీ, సీబీఐ విచారణ చేయాలని కోరారు. బ్రోకర్లతో కలిసి సినీ ఇండస్ట్రీలో ఉన్న వారి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని ఆరోపించారు. తన ఫోన్ హ్యాక్ చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదని తెలిపారు. తన భార్య ఫోన్ కూడా హ్యాక్ చేశారని పేర్కొన్నారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు చెప్పాడని అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి.. రాత్రి 2 గంటలకు మై హోమ్ భుజాలో ఏ హీరోయిన్ దగ్గరకి పోతున్నావో అందరికి తెలుసు – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/n1UoxvPs9p
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025
ఇవాళ కేబినెట్ మీటింగ్ జరగాల్సి ఉందని.. కానీ తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేందుకు మంత్రులంతా ఢిల్లీకి వెళ్లారని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఢిల్లీలో పెద్ద పంచాయతీ అవుతుందని పేర్కొన్నారు. అందుకే కేబినెట్ సమావేశం రద్దు చేసుకుని ఢిల్లీలో పంచాయతీ నడుస్తుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌పై తేల్చేవరకు కేబినెట్ మీటింగ్‌కు రామని మంత్రులు చెప్పారంట అని అన్నారు. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.