Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి సర్కారులో దోపిడీ పాలన యథేచ్ఛగా సాగుతున్నది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో అక్రమాలకు అంతులేకుండాపోతున్నది. ప్రజాధనాన్ని అనుయాయులకు అప్పనంగా దోచిపెట్టేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో అడ్డగోలు విధానాలను ప్రభుత్వ పెద్దలు తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా విద్యుత్తు శాఖలోనూ ఓ భారీ కుంభకోణానికి నాంది పలికారు. స్వయంగా ఓ మంత్రికి చెందిన కంపెనీకే భారీ టెండర్‌ను కట్టబెట్టేలా మునుపెన్నడూ లేని వింత విధానం తీసుకొచ్చారు. అదే విద్యుత్తు శాఖలో గ్లోబల్ టెండర్ల ప్రక్రియ. ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వాళ్ల జేబుల్లో వందల కోట్లు నింపడమే గ్లోబల్ టెండర్లలో వెనుక అసలు ఉద్దేశం.
విద్యుత్తు శాఖలో ఏ పనులు చేపట్టాలన్నా ఆ సంస్థలో నమోదు చేసుకున్న కాంట్రాక్టర్ల నుంచే టెండర్లు పిలుస్తారు. ప్రక్రియలో ఎంపిక చేసిన వారికి పనులు అప్పగిస్తారు. కానీ ప్రస్తుతం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లో సుమారు 4వేలకు పైగా విద్యుత్ కాంట్రాక్టర్లు కొన్నేళ్ల నుంచి పనులు చేస్తున్నారు. ఇంతమంది అనుభవమున్న స్థానిక కాంట్రాక్టర్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వారెవరినీ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే కాంట్రాక్టు ఎవరికి ఇవ్వాలో ‘సచివాలయంలో పెద్దలు’ ముందే డిసైడ్ చేసి అందుకు అనుగుణంగా చకచకా పావులు కదుపుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవిష్యత్ విద్యుత్తు అవసరాల కోసం సుమారు 245 సబ్ స్టేషన్లు, నెట్వర్క్ పనులను చేపట్టేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రతిపాదనలు సిద్దం చేసింది. మొదటి దశలో సుమారు 58 సబ్ స్టేషన్ల నిర్మాణానికి పాత పద్ధ్దతిలోనే టెండర్లు పిలిచారు. అంతలో ఏమైందో కానీ ఆ టెండర్లను రద్దు చేశారు. వాటి స్థానంలో గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తున్నది. మొత్తం 245 సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే రూ.1500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. కానీ గ్లోబల్ టెండర్ల ద్వారా పనులు చేపడితే అదనంగా మరో రూ.400 కోట్లు ఖర్చు అవుతుందని డిస్కమ్‌లో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఓ మంత్రికి చెందిన కంపెనీ నిరుడు ఏపీలో విద్యుత్తు ప్రాజెక్టుకు సంబంధించిన పనులను దక్కించుకుంది. పనులను సకాలంలో చేపట్టకపోవడంతో ఏపీ ప్రభు త్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు పనులు ఎందుకు చేయడం లేదో చెప్పాలంటూ ఈపీడీసీఎల్ నోటీసులను జారీ చేసిందని తెలిసింది. కొన్ని రోజులకు ఆ పనుల టెండర్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. అక్కడ కాంట్రాక్టు సంస్థ వద్ద సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువ చేసే విద్యుత్తు సామాగ్రి మిగిలిపోయింది. ఆ సామాగ్రిని వినియోగించుకునేందుకు తమకున్న అధికార అండదండలతో తెలంగాణలోని విద్యుత్తు శాఖల్లో పనులను దక్కించుకునే ప్రయత్నం మొదలు పెట్టింది సదరు సంస్థ.
నమోదిత కాంట్రాక్టర్లు పోటీ పడి విద్యుత్తు శాఖ నిర్ణయించిన ధర కంటే 10-15 శాతం తక్కువకే పనులు చేసేందుకు టెండర్ వేసేవారు. గ్లోబల్ టెండర్లు పిలవడం ద్వారా భారీ కంపెనీలు మాత్రమే ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. పనుల అంచనా వ్యయం ముందు నిర్ణయించిన ధర కంటే 10-20 శాతం ఎక్కువగా చేసి గ్లోబల్ టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉంది. గ్లోబల్ టెండర్ల ద్వారా విద్యుత్ శాఖ పనులన్నీ బడా కంపెనీలకే కేటాయిస్తే విద్యుత్ సంస్థకు పెద్ద మొత్తంలో నష్టం కలుగుతుంది. ఇదంతా కూడా మంత్రి కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు అనేది సుస్పష్టం.
విద్యుత్తు శాఖలో గ్లోబల్ టెండర్లను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా 3500 నుంచి 4000 వరకు విద్యుత్తు శాఖ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఉమ్మడి ఏపీలో నమోదిత కాంట్రాక్టర్ల ద్వారానే పనులు చేపట్టేవారు. విద్యుత్ సంస్థలకు లాభాలు వచ్చే విధంగానే స్థానిక కాంట్రాక్టర్లు పనులు చేశారు. గ్లోబల్ టెండర్లు పిలిస్తే సంస్థ కోట్ చేసిన దానికంటే ఎక్కువ కోట్ చేస్తుంది. విద్యుత్ శాఖపై అదనంగా భారం పడుతుందే తప్ప, లాభం ఉండదు. ప్రభుత్వంలోని పెద్దలే గ్లోబల్ టెండర్ల విధానాన్ని తీసుకువచ్చి తమ వారికి లాభం చేకూరేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
– నక్కా యాదగిరి, తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్