తెలంగాణలో జరుగుతున్న అన్ని పరిణామాలకు సీఎం రేవంత్‌రెడ్డే కారణం.. ఆయన వైఫల్యం పార్టీ కొంప ముంచేలా ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. రేవంత్‌రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నారు తప్పితే ఆ స్థాయిని మాత్రం అందుకోలేకపోతున్నరు. రేవంత్ తీరు కారణంగా మంత్రులు ఎవరికివారే యమునాతీరే అన్నట్టు వ్యవహరిస్తున్నరు. విచ్చలవిడితనం పెరిగిపోయింది.
– కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మీనాక్షి
మేము తెలంగాణలో పార్టీకి సంబంధించిన అంశాలనే చూస్తున్నం. ప్రభుత్వ పరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం లేదు. పార్టీని సరిదిద్దడంపైనే దృష్టిపెట్టినం. గతంలో ఓసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలో కూర్చున్నందుకు ప్రతిపక్ష నాయకులు రాద్ధాంతం చేశారు. వారికి సొంత పార్టీ నేతలు కూడా మద్దతు పలికారు.– పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీతో మీనాక్షి, మహేశ్‌గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని, రేవంత్ పాలనా వైఫల్యం రాష్ర్టాన్ని అస్తవ్యస్తం చేసిందని ఇటీవల కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ తీరుతో తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజమని రాష్ట్ర వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మీనాక్షి నటరాజన్‌కు కూడా అర్థమైంది. ఇదే విషయమై ఆమె పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారంటూ మీనాక్షి నటరాజన్అధిష్ఠానం వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆమెకు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా తోడయ్యారు.
ఇద్దరూ కలిసి రేవంత్‌రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలకు ఆయనే కారణమని, ఆయన వైఫల్యం పార్టీ కొంప ముంచేలా ఉన్నదని చెప్పినట్టు సమాచారం. రేవంత్‌రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నారు తప్పితే ఆ స్థాయిని మాత్రం అందుకోలేకపోతున్నారని ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన తీరు కారణంగా పార్టీలో ఎవరికి వారు యమునా తీరు మాదిరిగా వ్యవహరిస్తున్నారని, విచ్చలవిడితనం పెరిగిపోయిందని చెప్పినట్టు సమాచారం. డీసీసీల ఎంపికకు సంబంధించి ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్, ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి, మహేశ్‌కుమార్ నుంచి రాష్ట్రంలోని పరిస్థితులపై వేణుగోపాల్ ఆరా తీసినట్టు తెలిసింది.
మీనాక్షికి మహేశ్‌గౌడ్ మద్దతు
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులకు కారణమేంటని కేసీ వేణుగోపాల్ ప్రశ్నించగా, తాము పార్టీకి సంబంధించిన అంశాలను మాత్రమే చూస్తున్నామని, ప్రభుత్వ పరమైన అంశాల్లో జోక్యం చేసుకోవడం లేదని మీనాక్షి చెప్పినట్టు తెలిసింది. మహేశ్‌గౌడ్ సైతం మీనాక్షికి మద్దతుగా మాట్లాడినట్టు సమాచారం. తాను పార్టీని సరిదిద్దడంపైనే దృష్టిపెట్టానని, ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడం లేదని మీనాక్షి చెప్పినట్టు తెలిసింది. గతంలో ఒకసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలో కూర్చున్నందుకు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయని, వారికి సొంత పార్టీ నేతలు సైతం మద్దతు పలికారని చెప్పినట్టు సమాచారం. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని చెప్పినట్టు తెలిసింది.
సీఎం భయపడుతున్నారు!
ప్రభుత్వంలో అదుపుతప్పిన పాలన, మంత్రుల మధ్య విభేదాలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ అధిష్ఠానానికి కీలక విషయాలు చెప్పినట్టు తెలిసింది. ఇదంతా సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యం వల్లే జరుగుతున్నదని తేల్చి చెప్పినట్టు సమాచారం. మంత్రులతో రేవంత్‌రెడ్డికి సఖ్యత లేదని, ఆయన చెప్పినట్టు ఒక్క మంత్రి కూడా వినడం లేదని కూడా చెప్పినట్టు తెలిసింది. ఇక క్యాబినెట్లో తనకన్నా సీనియర్లు ఉండడంతో వారిని పిలిచి మాట్లాడేందుకు సీఎం భయపడుతున్నారని చెప్పినట్టు సమాచారం. దీంతో సీనియర్ మంత్రులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. సీఎం దృష్టికి తీసుకురాకుండానే ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారని, అదే సమయంలో పలు సందర్భాల్లో సీఎం సైతం మంత్రులకు తెలియకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ రేవంత్‌రెడ్డికి శాఖలపై పట్టు రాలేదని, దీంతో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారని అన్నట్టుగా తెలిసింది. మంత్రుల మధ్య విభేదాలకు మరో కారణం చెప్పినట్టుగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారంలోకి రావడంపై అందరిలోనూ అనుమానాలు ఉన్నాయని, అందుకే ఇప్పుడే ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పినట్టు సమాచారం. ఇందులో భాగంగానే పంపకాల్లో వచ్చిన తేడా కారణంగా మంత్రుల మధ్య విభేదాలు బయటపడ్డాయని చెప్పినట్టు తెలిసింది.
వారికి డీసీసీలుగా అవకాశం ఇచ్చేది లేదు!
డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసింది. పార్టీ పంపించిన జాబితా అస్తవ్యస్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ‘మీరు పంపించేవి పంపించారు. మేం ఎవర్ని ఎంపిక చేయాలో వారినే చేస్తాం’ అని కేసీ స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. బంధువులకు, వారసులకు, ఎన్నికల తర్వాత పార్టీలోకి వచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డీసీసీలుగా అవకాశం ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది.