హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో బుధవారం జరిగిన తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చే జరగలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గోదావరి, కృష్ణా నదీ జలాలపై చర్చించేందుకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంపై చర్చించారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘గోదావరిపై బనకచర్ల కడుతామని ఆంధ్రప్రదేశ్ అడిగితే కదా మేం ఆపమని చెప్పడానికి. ప్రాజెక్టు కట్టాలనే ప్రతిపాదనే ఎజెండాలో లేనప్పుడు, మేం ఆపమనే చర్చే రాదు’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి – బనకచర్లపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రివర్ మేనేజ్మెంట్ అథారిటీ, సీడబ్ల్యూసీ వంటి సంస్థలన్నీ అభ్యంతరాలు తెలిపాయని అన్నారు.
ఈ సమావేశంలో రెండు రాష్ర్టాల మధ్య నాలుగు అంశాల్లో అంగీకారం కుదిరినట్టు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల్లో అన్ని పాయింట్స్‌లో టెలిమెట్రీ విధానాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేయడానికి ఏపీ అంగీకారం తెలిపిందని చెప్పారు. ఇది తెలంగాణ విజయంగా సీఎం అభివర్ణించారు. విభజన చట్టంలో పేరొన్నట్టు గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణ నుంచి, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఏపీ నుంచి పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల సూచనల మేరకు ప్లంజ్ పూల్‌తోపాటు అవసరమైన మరమ్మతులు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణ, గోదావరి నదులు, వాటి ఉపనదుల నీటి వినియోగంపై అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అధ్యయనానికి సీనియర్ అధికారులు, నిపుణులతో కూడిన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ కమిటీ నదీ జలాలపై ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, ఇతర సమస్యలు అన్నింటిపైనా సమగ్రంగా అధ్యయనం చేసి 30 రోజుల్లోగా నివేదిక ఇస్తుందని చెప్పారు.
‘మేం అపాయింట్ చేసిన కమిటీ కాబట్టి వాళ్లు ఎలాంటి సూచనలు చేసినా అమలు చేస్తాం’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మిగతా అంశాలను సీఎంల స్థాయిలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సమావేశం ప్రామాణికత ఏమున్నదని విలేకరులు ప్రశ్నించగా.. గతంలో అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకుంటే అమలు జరిగాయా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 2014లో పార్లమెంట్లో రాష్ట్ర పునర్విభజన చట్టం చేశారని, కానీ ఇందులోని కొన్ని అంశాలను ప్రధాని మోదీ ఒప్పుకోవడం లేదని అన్నారు. కాబట్టి ఇలా అనుమానించుకుంటూ పోతే ఏ అంశాలూ పరిష్కారం కావని అన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలను పరిషరించుకోవడానికే తాము ఢిల్లీకి వచ్చామని, జఠిలం చేసుకోవడానికి కాదని చెప్పారు. కొంతమంది తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎలాగైనా ఈ సమావేశం చెడిపోతే బాగుండు అని ఎదురు చూస్తున్నారని అన్నారు. వాళ్లకు పదేండ్లు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదని విమర్శించారు. అధికారం పోయిన దుఃఖంలో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం తమ బాధ్యత అన్నారు.