KTR | హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలు తిరగబడుతున్న పాలన.. ఏడాదిలోనే ఎదురీదుతున్న పాలన’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘ఆంక్షలు పెట్టి..ప్రజాకాంక్షలను తొక్కేస్తామంటే తెలంగాణ నేల ఊరుకోదు.. తిరగబడుతుంది.. తరిమికొడుతుంది.. తస్మాత్ జాగ్రత్త!’ అని హెచ్చరించారు. ఫార్మా రైతులకు న్యాయం చేస్తామని కబుర్లు చెప్పిన సీఎం రేవంత్రెడ్డి సెక్యూరిటీ లేకుండా తన సొంత మండలం దుద్యాలకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి మోసాలకు అధికారులు ఎందుకు బలి పశువులను చేస్తున్నారని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూర్ఖత్వం వల్లే అధికారులు దెబ్బలు తినాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో పరిపాలన, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణే రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఏకంగా జిల్లా కలెక్టర్పైకి రైతుల తిరుగుబాటు అని తెలిపారు. రేవంత్రెడ్డి దురాశ, అవగాహనా రాహిత్యం వల్లే ఈ దుస్థితి దాపురించిందని చెప్పారు. భూసేకరణ పూర్తయి, అన్ని అనుమతులు వచ్చి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీని రద్దుచేసి, రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే రేవంత్రెడ్డి తుగ్లక్ అలోచనే ఈ అలజడికి కారణమని విశ్లేషించారు.
ఫార్మా సిటీకోసం సేకరించిన భూములను అమ్ముకొని సొమ్ముచేసుకుందామనుకున్న రేవంత్ కుత్సిత బుద్ధితో ఇప్పుడు ఫార్మాసిటీ భవితవ్యం ప్రమాదంలో పడిందని, కొడంగల్లో అన్నదాతల భూములు గుంజుకునే కుట్ర మొదలైందని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నదని, అనేకచోట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని, అదికాస్తా కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేస్తుందని పేర్కొన్నారు.