హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లను వినియోగించడంపై దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి గురువారం అధికారులను ఆదేశించారు. సిగ్నల్ జంపింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోంగార్డుల తరహాలో ఉపయోగించుకోవాలని సూచించారు.
వారికి హోంగార్డుల తరహాలో జీతభత్యాలు, ప్రత్యేక డ్రెస్ కోడ్ సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని తెలిపారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవాలపై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు.19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు.