హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ సీజన్ నుంచే సన్నవడ్లు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొన్న రెండురోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి సచివాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం ఆయన వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ సీజన్లో 66.73లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా, రికార్డుస్థాయిలో 140 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. సమావేశంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, సీఎస్ శాంతికుమారి, సివిల్ సప్లయ్ ఎండీ చౌహన్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు పాల్గొన్నారు.