KTR | ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… నర్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ వంటి రిజర్వాయర్లను పూర్తి చేసి, పంపులు ఆన్ చేసి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకోవడం తప్ప.. ఇప్పటివరకు రైతులకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదన్నారు.
ఎన్టీ రామారావు వంటి మహానాయకుడే కల్వకుర్తిలో ఓడిపోయారని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కార్యకర్తలకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న ప్రాంతమని, అక్కడ కరెంట్ కష్టాలు లేకుండా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్దేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, రైతుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంపైనా లేనంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్‌పై ఉందని, ప్రజల వెంట మనం ఉంటే.. వారే తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటారని అన్నారు.
రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను వేసుకోబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అవినీతి, హామీల వైఫల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాడుతూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.