ఖమ్మం/వరంగల్ సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధులు): రాష్ట్రంలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా పరిగణించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ర్టానికి రూ.2వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ విషయమై త్వరలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి తగిన ఆర్థికసాయం చేయాల్సిందిగా కోరనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుతూ ప్రధానికి ఇప్పటికే లేఖ రాశామని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ఖమ్మం నుంచి బయలుదేరి డోర్నకల్, మహబూబాబాద్, కురవి మీదుగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో పర్యటించారు. అంతకుముందు ఖమ్మంలోని మంత్రి పొంగులేటి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రకృతి సృష్టించిన బీభత్సం వల్ల అనేక జిల్లాలు వరదనీటిలో చిక్కుకున్నాయని, అపారనష్టం సంభవించిందని, ఈ విషయాలను ప్రధానమంత్రికి వివరించి ఆర్థికసాయం కోరతామని చెప్పారు.
ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తారా అన్న ప్రశ్నకు.. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని వ్యాఖ్యానించారు. ప్రధానిని తాను, తన మంత్రులే కలుస్తామని స్పష్టంచేశారు. వరదల వల్ల మరణించిన వారికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, వాటిని ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పిస్తే తమకు అభ్యంతరంలేదని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కేసీఆర్ రూ.2 వేల కోట్లు వరద సహాయక చర్యలకు ఇవ్వాలని అన్నారు. అనంతరం మహబూబాబాద్ కలెక్టరేట్లో సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్నా కొంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు. ఆస్తి పత్రాలు, భూముల పట్టాదారు పాసుపుస్తకాలు, పిల్లల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఇతరత్రా ప్రభుత్వ గుర్తింపు పత్రాలు అన్నీ తడిసి పనికిరాకుండా పోయాయి. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్ని రకాల సర్టిఫికెట్లను కొత్తగా జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి నర్సంపేట, వరంగల్, జనగామ మీదుగా రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్లారు.
వరంగల్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. చెరువుల ఆక్రమణలపై రాష్ట్రవ్యాప్తంగా త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. చెరువులను ఆక్రమించినవారు ఎంతటి వారైనా వదిలి పెట్టబోమని అన్నారు. హైడ్రా తరహాలో ప్రతి జిల్లాకు ఒక వ్యవస్థను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో వరద నష్టంపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఒక మాజీ మంత్రి ఆక్రమణ వల్లనే ఖమ్మంలో వరద ముంచెత్తిందనే ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులను యథేచ్ఛగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.