Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టారు. గురువారం జరుగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి ఆయన హాజరుకానున్నారు. అనంతరం పార్టీ పెద్దలు సమయం ఇస్తే వారిని కలిసి హైడ్రాతోపాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 25వ సారి. వారం క్రితమే ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం.. బుధవారం మళ్లీ విమానం ఎక్కనున్నారు. 10 నెలల్లోనే ఇన్నిసార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ సమయంలో ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లిన సందర్భాలు లేవు. ఆయన వెళ్లినప్పుడల్లా రెండు నుంచి ఐదు రోజులు అక్కడే ఉంటున్నారు. ఈ విధంగా దాదాపు 50 రోజులు అక్కడే మకాం వేశారు. జనవరిలో దావోస్ పర్యటన అని, ఆగస్టులో అమెరికా పర్యటన అని, ఇతర పర్యటనలతో సుమారు 20 రోజులపాటు విదేశీ పర్యటనల్లో గడిపారు.
సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ, విదేశీ పర్యటనలపై ఆది నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పర్యటనలతో ఆయన సాధించిందేమిటి అన్న ప్ర శ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఢిల్లీకి 25 సార్లు వెళ్లిన సీఎం రాష్ర్టానికి ఏం సాధించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. విదేశీ పర్యటనల విషయానికొస్తే.. దావోస్ పర్యటనలో 40 వేల కోట్ల పెట్టుబడులని, అమెరికా పర్యటనలో 30వేల కోట్ల పెట్టుబడులంటూ పేపర్లపై అంకెల గారడీ చూపించారే తప్ప.. క్షేత్రస్థాయిలో ఏదీ అమలు కాలేదనే పేర్కొంటున్నారు. విదేశాల్లో పర్యటన అనుభవాన్ని ఉపయోగించి ఇక్కడ పేదల ఇండ్లు కూల్చుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.