హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తేతెలంగాణ): ‘హస్తిన యాత్రల్లో అర్ధశతకం సాధించిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఒరగబెట్టింది శూన్యం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ, చంద్రబాబు ముద్దు ల బానిసగా తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టారని శనివారం ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీకి వెళ్లిన ఆయన సాధించిన ప్రాజెక్టులు ఎన్ని? తెచ్చిన నిధులెన్ని? అని ప్రశ్నించారు. ఢిల్లీ బాసుల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రాన్ని ఫైళ్లతో కాకుండా ఫ్లైట్ బుకింగ్స్‌తో నడుపుతున్నారని దుయ్యబట్టారు. ‘ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవ డం, చేతులు ఊపుకుంటూ వెళ్లడం, ఢిల్లీకి హైదరాబాద్‌కు అప్ అండ్ డౌన్ చేయడం, ఖాళీ చేతులతో తిరిగిరావడం.. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఈ మూడు పనులను పట్టుదలతో చేస్తున్న ఘనత ఆయన సొంతం’అని ఎద్దేవా చేశారు. టూరిస్ట్ ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తిగా రేవంత్ మిగిలిపోతారని చురకలంటించారు.
మనకు పాలించే ముఖ్యమంత్రి కావాలని, ఢిల్లీకి విహారయాత్రలు చేసే టూరిస్ట్ సీఎం అవస రం లేదని దెప్పిపొడిచారు. ‘ముగ్గురు యజమానుల ముద్దుల బానిస అయిన రేవంత్‌రెడ్డి తన ఫస్ట్ బాస్ రాహుల్‌గాంధీకి నోట్ల కట్టల మూటలు మోస్తూ పదవిని కాపాడుకుంటున్నరు. సెకండ్ యజమాని మోదీ సన్నిహితులైన వ్యాపారవేత్తలకు తెలంగాణ ను అప్పనంగా అప్పగించి కేసుల నుంచి తప్పించుకుంటున్నరు. ఇక మన అన్నదాతల కడుపుకొడుతూ తెలంగాణ జలసంపదను థర్డ్ యజమాని అయిన ఏపీ సీఎం చంద్రబాబుకు దోచి పెడుతున్నరు’అని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
తెలంగాణపై సోయిలేని రేవంత్‌రెడ్డి పాలనలో సుసంపన్నమైన రాష్ట్రం నిలువు దోపిడీకి గురవుతున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. త్యాగాల పునాదులపై పురుడు పోసుకున్న తెలంగాణకు రేవంత్‌రెడ్డి బానిస మనస్తత్వంతో అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలతో తీరని నష్టం జరుగుతున్నదని ఆరోపించారు. సీఎంకు చిత్తశుద్ధి, దమ్ము ధైర్యం ఉంటే 50 సార్లు ఢిల్లీ యాత్రలతో సాధించిందేంటో చెప్పాలని, కనీసం ఆయన సాధించిన ఒక్క ప్రాజెక్టు ప్యాకేజీ వివరాలైనా వెల్లడించాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మంజూరు చేయించిన నిధులెన్నో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ సర్కారు అక్రమంగా నిర్మించ తలపెట్టిన బనకచర్లతో తెలంగాణ వ్యవసాయ రంగం పెను సంక్షోభంలో కూరుకుపోతుందని యావత్ తెలంగాణ తల్లడిల్లుతున్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం గురువైన చంద్రబాబుకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీరందక రైతన్నలు ఇబ్బందులు పడుతుంటే సీఎంకు మాత్రం సోయిలేకపోవడం సిగ్గుచేటన్నారు. పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర అందక, పొలాల్లో చల్లేందుకు యూరియా దొరక్క అన్నదాతలు అరిగోస పడుతుంటే రేవంత్‌రెడ్డి మాత్రం ఫొటోషూట్లు, వీడియోలు, విందు రాజకీయాలతో జల్సాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
అధికారంలోకి రాగానే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ 20 నెలలు దాటినా ఆ ఊసు ఎత్తడం లేదని దుయ్యబట్టారు. హస్తం పార్టీ పాలనలో జాబ్ క్యాలెండర్ల జాడలేదు, రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, తులం బంగారం పత్తాలేదు, నాలుగు వేల పింఛన్ మాటేలేదు, గురుకులాల గోడు పట్టదు, హాస్టళ్ల విద్యార్థుల ఆకలికేకలు ఆగడంలేదు. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం మూడు రోజుల్లో మూడు ఫ్లైట్లు ఎక్కుతున్నరు’ అని తూర్పారబట్టారు. ఢిల్లీ టూర్లతో హాఫ్ సెంచరీ సాధించిన రేవంత్‌రెడ్డి తెలంగాణకు సాధించింది శుష్కప్రియాలు.. శూన్య హస్తాలేనని ఎద్దేవా చేశారు.