గీసుగొండ, ఆగస్టు 23: రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేసి సీఎం రేవంత్రెడ్డ్డి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని, పాలన పక్కన పెట్టి వారానికి రెండు సార్లు ఢిల్లీకి వెళ్తున్నారని, దేవుళ్లను మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రికే దక్కుతుందని, రైతుల రుణాలు మాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గం నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక రైతును నిండా ముంచిందని విమర్శించారు. కుర్చీని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారని విమర్శించారు. గ్యారెంటీల పేరుతో గారడీలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటాలకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.