మూసీ పరీవాహక అభివృద్ధి కోసం ఐదేండ్లలో లక్షా యాభై వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి తొందర్లోనే పనులు ప్రారంభించబోతున్నాం.
– జూలై 20న గోపనపల్లి సభలో సీఎం రేవంత్
మూసీ పరీవాహక అభివృద్ధి కోసం లక్షన్నర కోట్లు ఖర్చుచేస్తున్నట్టు ఎవరు చెప్పిండ్రు? కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నరు.
– గురువారం మీడియా సమావేశంలో రేవంత్
Revanth Reddy | హైదరాబాద్/సిటీబ్యూరో అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్ నవ్వులపాలైంది. అబద్ధాలు, అర్ధసత్యాలతో మాట్లాడేందుకు ప్రయత్నించి రేవంత్ అభాసుపాలయ్యారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఆయనే కౌంటర్ వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో నవ్వులపాలయ్యారు. మాజీ సీఎం కేసీఆర్‌ను, మూసీ బాధితులకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును తిట్టడానికే ప్రెస్‌మీట్ పెట్టినట్టు కనిపించింది.
సుందరీకరణ.. మీరన్నదే
తాము చేపట్టింది మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కాదని, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అని ప్రెస్మీట్లో రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అసలు సుందరీకరణ అని ఎక్కడి నుంచి వచ్చింది? అని, ఆ పదం ఎందుకు వాడుతున్నారని మీడియాను ప్రశ్నించారు. వాస్తవానికి ఆ పదాన్ని ఉపయోగించింది తానేనన్న విషయాన్ని సీఎం మర్చిపోయినట్టున్నారు. ఈ ఏడాది జూలై 20న గోపనపల్లిలో ఫ్లైవోవర్ ప్రారంభోత్సవంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘మూసీని సుందరీకరించి లండన్‌లోని థేమ్స్ కంటే అద్భుతంగా అభివృద్ధి చేస్తాం’ అని చెప్పారు.
పీపీపీ మాటేమిటి?
కన్సల్టెంట్లకు రూ.141 కోట్లతో మాత్రమే ఒప్పందం చేసుకున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆ వెంటనే ప్రాజెక్టుకు నిధుల సమీకరణ గురించి మాట్లాడుతూ అవసరమైతే ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో వాళ్లకే అప్పగించే ఆలోచన చేస్తామని కూడా అన్నారు. దీంతో దీనర్థం ఏమిటి? ఒప్పందం విలువ కేవలం రూ.141 కోట్లేనా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
మూడు.. ఐదయ్యాయి
సింగపూర్‌కు చెందిన మెయినహార్ట్, రియోస్, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అనే మూడు కంపెనీల కన్సార్షియంకు మాస్టర్‌ప్లాన్ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఈ నెల 4న ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబరు 472 జారీచేసింది. అందులో ఈ మూడు కంపెనీల పేర్లను స్పష్టంగా పేర్కొన్నది. ఐదో తేదీన ఎంఆర్డీసీఎల్ చీఫ్ ఇంజినీర్ ఈ మూడు కంపెనీలతో ఒప్పందం చేసుకుంటూ ఎల్వోఏ కూడా జారీచేశారు. రేవంత్‌రెడ్డి మాత్రం గురువారం ప్రెస్మీట్లో ఈ మూడు కంపెనీలతో పాటు ఝా, సోమ్ అనే మరో రెండు కంపెనీలను కూడా కలిపి ఐదు కంపెనీల కన్సార్షియంకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఒకలా? సీఎం వ్యాఖ్యలు మరోలా? అసలు టెండర్లలో బిడ్ దాఖలు చేయని ఝా, సోమ్ కంపెనీలకు బాధ్యతలు ఎలా అప్పగిస్తారు? అనేది తేలాల్సి ఉంది.
పునరుజ్జీవనంలో కంపెనీల గోల ఎందుకు?
మూసీ సుందరీకరణ కాదు, పునరుజ్జీవనం అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే పేదల ఇండ్లను కూల్చివేస్తున్నామని చెప్పారు. సాంకేతికంగా నది పునరుజ్జీవనం అంటే శతాబ్దం కిందట మూసీ ఎలా ఉందో అలా తయారుచేయడం. అందులో మురుగు, పరిశ్రమల నుంచి కాలుష్యం చేరకుండా కట్టడి చేయడం. ఇదే జరిగితే దాని పరీవాహకంలో ఉన్న నిరుపేదల బతుకులు బాగుపడినట్టే కదా! ఇప్పటివరకు మురుగు పక్కన ఉన్న ఆ పేదల నివాసాలు స్వచ్ఛమైన మూసీ జలాలు పారే నదీ పరీవాహకంలో ఉండటమంటే అదో అద్భుతమైన దృశ్యం కదా. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం పేదల ఇండ్లను కూల్చి, వారిని అక్కడి నుంచి తరలిస్తామంటున్నారు.
అంటే సామాన్యుడికి ఆ అద్భుతమైన నదీ పరీవాహకంలో ఉండే అదృష్టం లేదా? అనే సందేహాలు కలుగుతున్నాయి. పేదల ఇండ్లను కూల్చిన తర్వాత అక్కడ అంతర్జాతీయ కంపెనీలు కొలువుదీరుతాయని కూడా సీఎం చెప్పారు. తాము ఎంపిక చేసిన సింగపూర్ కన్సల్టెన్సీల కన్సార్షియం కార్పొరేట్ కంపెనీలను తీసుకువచ్చి అక్కడ రకరకాల ప్రాజెక్టులు చేపట్టేలా చొరవ తీసుకుంటాయని చెప్పారు. అంటే పేదల ఇండ్లను కూల్చివేసి ఆ స్థలాల్లో కార్పొరేట్ కంపెనీలు కొలువుదీరుతాయని స్పష్టత ఇచ్చారు. అలాంటప్పుడు అది మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఎలా అవుతుంది? కార్పొరేట్ కంపెనీలు కొలువుదీరి వినోద, విలాస ప్రాజెక్టుల్లో భాగమైన మల్టీప్లెక్స్‌లు, ఆకాశహర్మ్యాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు కొలువుదీరితే అది సుందరీకరణ కాక మరేమవుతుందో ప్రభుత్వానికే తెలియాలి.
సమతామూర్తికి మెయిన్‌హార్ట్‌కు సంబంధం లేదు
మూసీ ప్రాజెక్టుకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న మెయిన్‌హార్ట్ కంపెనీని వెనుకేసుకొచ్చేందుకు రేవంత్‌రెడ్డి విశ్వ ప్రయత్నం చేశారు. ఆ కంపెనీ దేశ విదేశాల్లో అనేక అద్భుతాలు సృష్టించిందని కొనియాడారు. ఈ క్రమంలో పప్పులో కాలేశారు. హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లో చినజీయర్‌స్వామి ట్రస్ట్ నిర్మించిన ఆదిశంకరాచార్య విగ్రహం ‘సమతామూర్తి’ పనులు మెయిన్‌హార్ట్ ఆధ్వర్యంలో జరిగాయంటూ గొప్పలు చెప్పారు.
కేసీఆర్‌పై, చినజీయర్‌స్వామిపై అసందర్భ వ్యాఖ్యలు చేశారు. కానీ, మెయిన్‌హార్ట్ కంపెనీకి, సమతామూర్తికి ఎలాంటి సంబంధం లేదు. కంపెనీ అధికారిక వెబ్సైట్లో కూడా సమతామూర్తి ప్రాజెక్టు వివరాలేమీ లేవు. డిజైన్ కన్సల్టెంట్‌గా పద్మ విభూషణ్ డాక్టర్ రాఘవన్ ఎన్ అయ్యర్ బృందం పనిచేసింది. కాంట్రాక్టర్‌గా వేరే కంపెనీ వ్యవహరించింది. ఈ విషయాలను కూడా సీఎం పరిశీలించకపోవడంపై విశ్లేషకులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్మీట్లో మధ్యప్రదేశ్‌లోని విగ్రహాన్ని చూపించి శంషాబాద్‌లోని విగ్రహంగా ప్రచారం చేశారు.
ఆరోపణలపై వివరణ ఏది?
మెయిన్‌హార్ట్ కంపెనీపై పాకిస్థాన్ ప్రభుత్వం నోటీసులు జారీచేసిన అంశంపై రేవంత్‌రెడ్డి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్రెస్మీట్లో కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారని సీఎం చెప్పారు. కనీసం వారితో అయినా వివరణ ఇప్పించే ప్రయత్నం చేయడం లేదు.
ఒక్క పెళ్ల కూడా కూల్చలేదు
మూసీ పరీవాహకంలో ఒక్క పెళ్ల కూడా ప్రభుత్వం కూల్చలేదని రేవంత్ చెప్పారు. నిర్వాసితులే స్వచ్ఛందంగా ఇండ్లను వదిలిపెట్టి, ఆనందంగా వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. కానీ, మూసీ పరీవాహక ప్రాంతంలో తమ ఇండ్లు కూల్చొద్దంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయని, ఇంట్లో ఉన్న సామాను తీసుకునే సమయం కూడా ఇవ్వలేదని, కనీసం తమ పుస్తకాలు కూడా తీసుకోనివ్వలేదని స్థానికులు కన్నీరుమున్నీరైన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
రాడార్ స్టేషన్.. కసబ్
మూసీ నది జన్మస్థానమైన వికారాబాద్‌లో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు చేస్తే నది కలుషితం అవుతుంది కదా? మరి పునరుజ్జీవం ఎలా సాధ్యం అన్న మీడియా ప్రశ్నకు సీఎం ఎదురుదాడి చేశారు. ఇది దేశభక్తికి సంబంధించిన అంశం అంటూ, ఈ ప్రాజెక్టును వ్యతిరేకించేవాళ్లను ఉగ్రవాది కసబ్‌తో పోల్చారు.
మూసీ పుట్టుకకు కొత్త అర్థం
మూసీ నది చరిత్రపై, పేరుపై సీఎం రేవంత్‌రెడ్డి కొత్త అర్థాలు చెప్పారు. చరిత్రకారులకే తెలియని కొత్త చరిత్ర సృష్టించారు. మూసా, ఈసా కలయికే మూసీ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మూసా అంటే మోజెస్ అని, ఈసా అంటే ఏసు అని కొత్త అర్థం చెప్పారు. మోజెస్, ఏసు కలయికతో రామలింగేశ్వర స్వామి దగ్గర ప్రారంభమై మక్కా మసీదును దాటుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదంటూ కొత్త అర్థం చెప్పారు. దీనిపై చరిత్రకారులు సైతం నోరెళ్లబెడుతున్నారు.
అఖిల పక్షం.. ప్రశ్నలు పంపండి
మూసీ ప్రాజెక్టుపై అఖిల పక్షాన్ని పిలిచి అనుమానాలు నివృత్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు మాట మార్చి ప్రశ్నలు, అనుమానాలను పేపర్‌పై రాసి పంపాలంటూ సూచన చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫ్రస్టేషన్లో ఉన్నారని, మూసీపై ముందుకు వెళ్లలేక, ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడాకే ఈ ప్రెస్‌మీట్ పెట్టారని చెప్తున్నారు. కానీ, అరకొర సమాచారంతో మీడియా ముందుకు వచ్చి ఒకటి చెప్పబోయి, మరొకటి చెప్పి అభాసుపాలయ్యారు.
లక్షన్నర కోట్లూ.. మీ నోటి నుంచే
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఐదు కన్సల్టెన్సీల కన్సార్షియంతో రూ.141 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మధ్యలో రూ. 1.5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ఈ సంఖ్య కూడా ఆయన చెప్పిందే. జూలై 20న గోపనపల్లిలో సీఎం మాట్లాడుతూ.. ‘మూసీ పరీవాహక అభివృద్ధి కోసం ఐదేండ్లలో లక్షా యాభై వేల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి తొందర్లోనే పనులు ప్రారంభించబోతున్నాం’ అని ప్రకటించారు.
సీఎం, మంత్రులు ఈ ప్రాజెక్టు విలువను తొలుత రూ. 50 వేల కోట్లతో మొదలు పెట్టి రూ.లక్షన్నర కోట్లకు పెంచారు. ఈ ఏడాది ఏప్రిల్ 21న నల్లగొండలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. అక్కడ మాట్లాడుతూ ‘రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేసి నల్లగొండ జిల్లాను కాలుష్యం నుంచి విముక్తి కల్పించే బాధ్యత నాది’ అని ప్రకటించారు. జూలై 14న మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ సదస్సులో మాట్లాడుతూ ‘మూసీని రూ.70వేల కోట్లతో లండన్‌లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేయబోతున్నాం’ అని చెప్పారు. ఆరు రోజుల తర్వాత ప్రాజెక్టు విలువను స్వయంగా సీఎం రూ.లక్షన్నర కోట్లకు పెంచారు.