Dasoju Sravan | బీసీలకు ఉన్న రిజర్వేషన్లు కూడా రాకుండా సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అసాధ్యమని అన్నారు. ట్రిపుల్ టెస్ట్ పూర్తి చేయకుండా రాష్ట్రాలు రిజర్వేషన్లు పెంచలేవని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా కాంగ్రెస్ మోసం చేస్తున్నారని దాసోజు శ్రవణ్ తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ బదులు ప్లానింగ్ శాఖ ద్వారా కులగణన చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ కులగణన చెల్లదని చెప్పారు. రాజకీయంగా బీసీల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. బీసీల వర్గీకరణ చేయకుండా ప్రభుత్వం జీవో ఇచ్చిందని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన రెండో టెస్ట్ కాంగ్రెస్ సర్కార్ ఫెయిలైందని చెప్పారు. గవర్నర్, రాష్ట్రపతి దగ్గర బిల్లులు ఉండగా జీవోలు తెచ్చారని తెలిపారు. ఏదో రకంగా సాధిస్తారేమో అని బీఆర్ఎస్ కూడా మద్దతు పలికిందని అన్నారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో కనీసం ప్రైవేటు బిల్లు కూడా పెట్టలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సర్వేలో బీసీలు 51 శాతం ఉన్నారని తేలిందని అన్నారు. రేవంత్ సర్కార్ చేయించిన సర్వేలో 46 శాతానికే పరిమితం చేశారని తెలిపారు. పంచాయతీ ఎన్నిలకు ఇచ్చిన ఈ జీవో ఎక్కడా నిలబడదని అన్నారు. జీవోల ద్వారా ఎస్సీ, ఎస్టీలు.. బీసీల మధ్య ఘర్షణ పెట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ట్రిపుల్ టెస్ట్ పూర్తి చేయకుండా బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కూడా అసాధ్యమని దాసోజు శ్రవణ్ అన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, కర్ణాటక బీసీ కోటా పెంపును కోర్టులు కొట్టేశాయని తెలిపారు. అయినా కూడా రేవంత్ రెడ్డి అదే పద్ధతిలో జీవోలు ఇస్తున్నాడని పేర్కొన్నారు.