న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కండువా మెడలో వేసినంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్టేనా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తన ఇంటికి వచ్చిన వారికి అందుబాటులో ఉన్న కండువా వేస్తానని, అంతమాత్రాన పార్టీ ఫిరాయించినట్టు అవుతుందా? అని బుకాయించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం మీడియాతో చిట్‌చాట్‌లో పార్టీ ఫిరాయింపులను కప్పిపుచ్చుకొనేందుకు ఆపసోపాలు పడ్డారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్టమైన నియమాలంటూ ఏమీ లేవని బుకాయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని స్పీకర్‌కు సూచించానని, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉన్నదన్నారు.
తన ఎమెల్యే జీతం నుంచి నెలకు రూ.5 వేలు బీఆర్ఎస్ఎల్పీకి వెళ్లినట్టు ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారని తెలిపారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వ్యవహారంపై ఆ పార్టీ నేతలకే స్పష్టతలేదని, తమ పార్టీలో 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీశ్‌రావు అసెంబ్లీలో చెప్పారని, కేటీఆర్ మాత్రం 10 ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్తున్నారని సీఎం అన్నారు. మెట్రో విస్తరణకు ఎల్అండ్టీ సహకరించడం లేదని, కేటీఆర్‌తో కలిసి అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పినట్టు ఎల్అండ్టీ వినాల్సిందేనని, లేదంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మెట్రో విస్తరణకు అనుమతులు అడిగితే కేంద్రం, మెలిక పెడుతున్నదని చెప్పారు. ప్రాజెక్టు ఖర్చుకు, ఎల్అండ్టీ అడుగుతున్న దానికి చాలా తేడా ఉందని చెప్పారు. ప్రస్తుత మెట్రో ప్రాజెక్టు వ్యయం రూ.13 వేల కోట్లు అని, దీనిపై ఆ సంస్థ రూ.7 వేల కోట్లు అప్పు చేసినట్టు సీఎం చెప్పారు.
కిషన్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదు?
కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇస్తే 48 గంటల్లో విచారణ చేపట్టేలా చూస్తానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గతంలో అన్నారని రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ‘ఇప్పుడు ఎన్ని రోజులైంది? కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?’ అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డికి సొంత అభిప్రాయాలు ఉండవని, కేటీఆర్ నుంచే సలహాలు తీసుకుంటారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తును ఆపాలని కేటీఆర్ చెప్తారని, కిషన్‌రెడ్డి అమలుచేస్తారని ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు వేయకపోవడమే దీనికి సాక్ష్యమని చెప్పారు. కేసును సీబీఐకి ఇచ్చాం కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదుచేసి మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు ప్రారంభించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.
యూరియా కొరతకు వాళ్లే కారణం
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలే యూరియా సమస్యకు కారణమని రేవంత్‌రెడ్డి వింత ఆరోపణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే రాష్ర్టానికి యూరియా రాకుండా అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించారని, దీనికి గత 75 ఏండ్ల కాలం రికార్డులు చూస్తున్నామని, నికర, వరద, మిగులు జలాల్లో ఏవి ఎంత ఉన్నాయనే లెకలు తీస్తున్నామని, సరాసరి ఎన్ని టీఎంసీలు వాడుతున్నారో గణాంకాలు తయారుచేసేపనిలో నిమగ్నమై ఉన్నామని చెప్పారు. తమ్మిడిహట్టికి మిగులు జలాలు వాడుకుంటామని, మహారాష్ట్రతో మాట్లాల్సి ఉందన్నారు. మహారాష్ట్ర సీఎం నుంచి అపాయింట్మెంట్ రాలేదని చెప్పారు.