Harish Rao | సిద్దిపేట, నవంబర్ 8: కేసీఆర్ పేరును ఎవరూ చెరిపేయలేరని, ఈ భూమి ఉన్నంతకాల ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టంచేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ మరువలేరని తేల్చిచెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెకులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద మాటాలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ కట్టించిన యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లి తన పుట్టినరోజును జరుపుకొన్న విషయాన్ని సీఎం గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. మూసీ సుందరీకరణ చేసి అందులో గోదావరి నీటిని పారిస్తానంటున్న సీఎం, కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం నుంచే మూసీకి నీటిని తరలించాలనే విషయాన్ని గుర్తెరగాలని చెప్పారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకపోతే నువ్వు ముఖ్యమంత్రివి అయ్యేవాడివా? అని రేవంత్‌ను ప్రశ్నించారు.
11 నెలల పాలనలో పేదవాళ్లకు ఒక ఇల్లు అయినా కట్టించావా రేవంత్‌రెడ్డీ.. అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కూలగొట్టుడు తప్ప కట్టే విధానం నీది కాదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు పడక ముందే రైతుబంధు ఇచ్చేదని గుర్తుచేశారు. ఇప్పుడు పంట చేతికొచ్చినా రైతుబంధు రాలేదని తెలిపారు. కేసీఆర్ బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలకు బట్టలు పంపిణీ చేసేవారని, రెండు చీరలు ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పటికీ ఒక చీర కూడా ఇవ్వలేదని విమర్శించారు. వృద్ధాప్యం పింఛన్‌ను రూ.4 వేలు ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి సర్కారు..
ఉన్న రూ.2 వేలను కూడా ఏప్రిల్‌లో, ఆగస్టు నెలల పింఛన్‌ను ఎగ్గొట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసినందుకు తీరని మోసం చేశారని రైతుల్లో ఆవేదన గూడుకట్టుకొని ఉన్నదని తెలిపారు. కేసీఆర్ ఉన్నప్పుడు నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోలు జరిగేదని, రెండు రోజులకే రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవని తెలిపారు. పోలీసులతో బెదిరించి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిలో సీఎం రేవంత్ ఉన్నాడని, ఆయన బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడబోదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తేల్చిచెప్పారు.