హైదరాబాద్, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): దేశీయ బల్క్ డ్రగ్ క్యాపిటల్గాను..గ్లోబల్ వ్యాక్సిన్ హబ్‌గా వెలుగొందుతున్న హైదరాబాద్ ఖ్యాతి రానున్న రోజుల్లో మసకబారనున్నదా..? అంటే పరిశ్రమ వర్గాలనుంచి అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఫార్మా రంగంపట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరే ఇందుకు కారణం కనిపిస్తున్నది. పొమ్మనలేక పొగబెట్టినట్టు ఉండగా, మరోవైపు ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి ఎన్డీఏ పాలిత రాష్ర్టాలు పరిశ్రమలను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, కల్పిస్తున్న ప్రోత్సాహకాలు మన రాష్ట్రంపాలిట గొడ్డలిపెట్టుగా మారాయి.
ఔషధ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరాకీని దృష్టిలో ఉంచుకొని పలు రాష్ర్టాలు ఫార్మా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుండగా, మన రాష్ట్రంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా దాదాపు 14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని అభివృద్ధి చేయగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా చర్యలు చేపట్టింది. అన్ని అనుమతులు మంజూరై.. పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి మొత్తం పరిశ్రమ వర్గాలను నిర్ఘాంతపోయేలా చేసింది.
అనంతరం కోర్టు ఆదేశాలతో ఫార్మాసిటీని గ్రీన్ ఫార్మా సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అక్కడ కాలుష్యకారక పరిశ్రమలకు తావులేకుండా పరిశ్రమలకు అనుమతిస్తామని, అంతేకాకుండా జనరల్ ఇండస్ట్రియల్ పార్క్ తరహాలో ఔషధ కంపెనీలతోపాటు పలు ఇతర కంపెనీలకు కూడా యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాస్తవానికి ఔషధ కంపెనీల నుంచి కలుషిత వ్యర్థాలు వెలువడుతాయి. వాటిని శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం కామన్ ఇఫ్లుయెంట్ ప్లాంట్లను ఏర్పాటుచేయాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా కాలుష్య పరిశ్రమలు ఏర్పాటుకాకుండా చూస్తామని చెప్పడం పరిశ్రమ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో కంపెనీలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ర్టాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి.
ఇదిలావుంటే, ఫార్మా రంగ సంస్థలను ఆకర్శించడానికి ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు ప్రగతిశీల విధానాల ద్వారా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాయి. ఫార్మాస్యూటికల్, మెడికల్ అండ్ డివైజ్ పాలసీ-2023 యూపీ ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించింది.
దేశంలో వేగంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మన రాష్ట్ర ఫార్మారంగంపై నీలినీడలు కమ్ముకున్నట్టేనని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో ఫార్మారంగ బలోపేతానికి తెలంగాణ ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల విధానాలు హైదరాబాద్ ఖ్యాతిని మరింత విస్తరింపజేశాయని చెబుతున్నారు. కానీ, ఇప్పుడు కొన్ని ఇతర రాష్ర్టాలు ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి, పెట్టుబడులను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నాయని పేర్కొంటున్నారు. అదే క్రమంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఇతర రాష్ర్టాలకు పోటీనిచ్చే విధంగా సబ్సిడీలు, ప్రోత్సాహకాలను కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నదని చెబుతున్నారు.