హైదరాబాద్‌సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): గాంధీ సరోవర్ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించనున్న బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ బాధితులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం రూపుదిద్దుకుంటున్న సమయంలో చెట్టుకొకరు, పుట్టకొకరులా అపార్ట్‌మెంట్‌వాసుల పరిస్థితి మారనున్నది. ప్రభుత్వ, అధికార యంత్రాంగం ఒక వ్యూహం ప్రకారం అల్లిన భూసేకరణ ప్రక్రియకు బలవుతున్న సమిధలు వారు. సాధారణంగా ప్రభుత్వం సేకరించే భూములు, ఇండ్లకు సంబంధించి నష్టపరిహారంగా నగదు ఇస్తే బాధితులు కొంతలో కొంతైనా వెంటనే ఆర్థిక, సామాజిక ఉపశమనం పొందేందుకు దోహదపడుతుంది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓవైపు ప్రాజెక్టుకు వేల కోట్ల రుణం తీసుకొస్తున్నామని చెప్తూ, మరోవైపు ఆ ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లు ఇచ్చే బాధితులకు మాత్రం ‘చిల్లిగవ్వ ఇవ్వం.. టీడీఆర్ రూపంలో బాండ్లు చేతిలో పెడతాం. మీ దారి మీరు చూసుకోండి!’ అని నిర్దయగా చెప్తుండటం వారిని ఆందోళనకు గురిచేస్తున్నది. అంతేకాదు.. రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం జారీ చేసిన టీడీఆర్ బాండ్ల ప్రస్థానం ‘బిగ్’ రియల్ దందాగా రూపాంతరం చెందడం కూడా ఈ బాధితుల భవిష్యత్తును మరింత ప్రశ్నార్థకంగా మార్చనున్నది.
మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ కోసం వడివడిగా భూసేకరణ ప్రక్రియను చేపడుతున్నది. ఇప్పటికే భూసేకరణ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసి, అభిప్రాయ సేకరణ పేరిట నామమాత్ర సమావేశాలు కూడా నిర్వహిస్తున్నది. అయితే నోటిఫికేషన్లో ప్రధానంగా బాధితులకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీరు వారిని మరింత భయాందోళనలకు గురిచేస్తున్నది. ఇదేదో చాలాకాలంగా ఉన్న నిబంధనల మేరకు జరుగుతున్న భూసేకరణ విధానమైతే, ఏదో సరిపెట్టుకోవచ్చు. కానీ కేవలం మూసీ ప్రాజెక్టును దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నిరోజుల కిందటే జీవో 168కి సవరణలు చేసింది.
నీటి వనరుల పరిధిలో భూమిని కోల్పోతున్న వారికి పరిహారాన్ని భారీగా పెంచామని ప్రభుత్వం పైకి ప్రకటనలు ఇస్తున్నది. కానీ సూక్ష్మంగా పరిశీలిస్తే.. నగదు పరిహారానికి శాశ్వతంగా స్వస్తి పలికి, కేవలం టీడీఆర్ బాండ్లను బాధితుల చేతుల్లో పెట్టి సర్కార్ చేతులు దులుపుకోనున్నది. గాంధీ సరోవర్ కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) నుంచి రూ.4,100 కోట్ల రుణ ప్రక్రియ చివరి దశలో ఉన్నదని ఒకవైపు ప్రభుత్వం చెప్తూనే, మరోవైపు భూములు ఇచ్చే వారికి మాత్రం టీడీఆర్ రూపంలో పరిహారం ఇస్తామని చెప్పడమంటే ఆ రుణంలో నయాపైస కూడా నిజమైన బాధితులకు చేరడం లేదనేది సుస్పష్టం. రుణం మొత్తం కాంట్రాక్టర్ల బిల్లులకే పరిమితం కానున్నది.
స్థూలంగా చూస్తే టీడీఆర్ విధానం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవిక మార్కెట్లో ఈ బాండ్ల లావాదేవీలు, గత రెండున్నర సంవత్సరాల్లో ఈ మార్కెట్ కొందరి ‘హస్త’గతం కావడం చూస్తుంటే మూసీ బాధితులకు దక్కేది నామమాత్రమేనని అర్థమవుతుంది. ఉదాహరణకు.. బండ్లగూడ జాగీర్‌లోని మధు పార్క్ రిడ్జ్ను తీసుకుంటే సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో ఉన్న రేటు చదరపు అడుగుకు రూ.2,200. దీని ఆధారంగానే ప్రభుత్వం పరిహారాన్ని ఇవ్వనున్నది. తొమ్మిది మీటర్ల బఫర్‌జోన్ కంటే అవతల ఉందని ఈ నివాస సముదాయానికి అనుమతులు ఇచ్చారు. ఆపై 2012లో బఫర్ పరిధి 30మీటర్లకు పెరిగినా ఈ అపార్ట్మెంట్లు అంతకంటే దూరంలోనే ఉన్నాయి.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే భూసేకరణ నోటిఫికేషన్లో బఫర్‌జోన్‌ను 50 మీటర్లుగా నిర్ధారించింది. దీంతో ఈ నివాసాలు బఫర్లోనే ఉంటున్నందున పరిహారం 300 శాతం వస్తుంది. అంటే చదరపు అడుగుకు రూ.6,600 అన్నమాట. వెయ్యి చదరపు అడుగుల ఫ్లాటుకు వచ్చే మొత్తం రూ.66 లక్షలు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ టీడీఆర్ బాండ్లను బాధితులు మార్కెట్లో విక్రయించడమే అతి పెద్ద సవాల్.
సాధారణంగా నిర్మాణరంగ మార్కెట్లో టీడీఆర్‌ను విక్రయించాలంటే సబ్ రిజిస్ట్రార్ రికార్డు విలువ కంటే చదరపు అడుగుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అదనపు ధర మాత్రమే చెల్లిస్తారు. ఈ మేరకు నిన్నటి వరకు టీడీఆర్ బాండ్ల ధర మార్కెట్లో 29 శాతం వరకు మాత్రమే ఉంది. అంటే రూ.20 లక్షల టీడీఆర్ బాండ్లు ఉన్న వారికి బిల్డర్లు సుమారు రూ.5.80 లక్షల వరకు చెల్లిస్తారు. అంటే రూ.66 లక్షలకు దాదాపు రూ.19.14 లక్షల వరకు మాత్రమే వస్తుంది.
గత ఆరు నెలల కిందటే రాష్ట్రంలో టీడీఆర్ మార్కెట్ ‘బిగ్’ రియల్ బృందం చేతుల్లోకి వెళ్లిందనేది బహిరంగ రహస్యం. సుమారు రూ.500 కోట్ల టీడీఆర్‌లను అడ్డికి పావుసేరులా కొనుగోలు చేసి, కృత్రిమ కొరతను సృష్టించారు. తద్వారా నిర్వాసితుల నుంచి 30 శాతం లోపు రేటుకు కొనుగోలు చేసి సదరు బృందం మాత్రం 56 శాతానికి అమ్ముకుంటుందని బిల్డర్లందరికీ తెలిసిన సత్యమే.
సదరు బృందం చేతుల్లో ఉన్న టీడీఆర్‌ను ముక్కుపిండి అంటగట్టేందుకు ప్రతి సర్కిల్లోనూ ఏజెంట్లను నియమించినట్టు తెలిసిందే. అంతేకాదు వీరికి సంబంధం లేని టీడీఆర్‌ల వివరాలు అసలు ఆన్‌లైన్‌లోనూ కనిపించడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలో మూసీ బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇచ్చినా ఈ బృందం బాండ్లు పూర్తయ్యే దాకా వీటిని విక్రయించడం సాధ్యం కాదని ఓ ఆర్కిటెక్ట్ స్పష్టం చేశారు. బాధితులకు డబ్బులు అవసరముండి త్వరగా అమ్ముకోవాలంటే వీళ్లకే అడ్డకి పావుశేరులా అదే 30శాతం లోపు ధరకు అమ్ముకోవడం తప్ప మరో గత్యంతరం ఉండదని చెప్పారు. ఒకేసారి భారీ ఎత్తున టీడీఆర్‌లు జారీ అయితే మార్కెట్లో సరఫరా పెరిగి ధర కూడా తగ్గుతుందని అంటున్నారు. వీటన్నింటికీ మించి గత రెండున్నరేండ్లుగా నిర్మాణ రంగంలో నెలకొన్న స్తబ్ధతతో టీడీఆర్‌ల డిమాండు ఏమేరకు ఉంటుందనేది కూడా ప్రశ్నార్థకమేనని ఆయన విశ్లేషించారు.
ఈ వ్యక్తి పేరు జీ రవీంద్రనాథ్. రిటైర్డ్ నేవీ ఉద్యోగి. ఈయన కూడా మధు పార్క్ రిడ్జ్లోనే భార్యతో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. కుమార్తె తన కుటుంబంతో బెంగళూరులో ఉంటున్నారు. రవీంద్రనాథ్ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే బ్యాంకు లోన్ తీసుకొని ఫ్లాట్ తీసుకున్నారు. ఆ రుణం కూడా తీరిపోవడంతో, తనకు నెలకు వచ్చే రూ.30వేల పింఛన్‌తో ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ పేరిట నివాస సముదాయాన్ని కూలుస్తామని చెప్తుండటంతో ఉన్నఫలంగా ఫ్లాటు ఖాళీ చేయాల్సి వస్తున్నది. నష్టపరిహారంగా టీడీఆర్ బాండ్లు ఇస్తారు. కుమారుడు జమ్ము కశ్మీర్లో సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తుండటంతో అక్కడ జవాన్ల తల్లిదండ్రులు వారితో కలిసి ఉండేందుకు అనుమతి లేదు. కాబట్టి అద్దె ఇల్లు తీసుకోవాల్సిందే. ఇప్పుడు భార్యాభర్తలు రూ.30వేల పింఛన్‌తోనే నెలవారీ ఖర్చులతోపాటు ఇంటి అద్దె చెల్లించాల్సిన పరిస్థితి.

ఈ ఫొటోలో ఉన్నది వేణుగోపాల్-శ్రుతి దంపతులు. వేణుగోపాల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. వీరికి ఒక అమ్మాయి. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నది. 2015లో బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. చుట్టూ పచ్చదనం, మంచి వాతావరణం, రవాణాపరంగానూ అనుకూతలతోపాటు ప్రధానంగా ఆర్మీ క్యాంపస్‌లతో భద్రత కూడా ఉండటంతో వాళ్లకు ఆ నివాస సముదాయం ఎంతో నచ్చింది. రూపాయి రూపాయి కూడబెట్టుకొని, ఇంటి రుణం తీసుకొని తాము అద్దెకు ఉన్న ఫ్లాట్‌నే నెల రోజుల కిందట రూ.70 లక్షలకు కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన రెండు వారాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ కింద భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో వీరి అపార్ట్మెంట్ కూడా ఉండటంతో ఆ కుటుంబానికి నిద్ర కరువైంది. హౌసింగ్ లోన్ కింద నెలకు రూ.55వేల ఈఎంఐ కట్టాలి. ప్రభుత్వం ఈ అపార్ట్మెంట్లను కూల్చి, నష్టపహారంగా టీడీఆర్(ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లు ఇవ్వనున్నది. అంటే చేతికి నగదు నయాపైసా రాదు. కేవలం ఆ బాండ్లను తీసుకొని, ఫ్లాటు ఖాళీ చేసి మరో ఇంటిని అద్దెకు తీసుకోవాలి. టీడీఆర్ బాండ్లను అప్పటికప్పుడు అమ్ముకొనే వీలుండదు. పైగా పది రూపాయల బాండ్‌కు రూ.3 వస్తయా? 4 వస్తయా? అనేది బిల్డర్లపై ఆధారపడి ఉంటుంది. అప్పటిదాకా ఒకవైపు రూ.55వేల ఈఎంఐ కట్టుకుంటూ, మరోవైపు ఇంటి అద్దె చెల్లించాల్సిందే.