KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్(ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.
తెలంగాణ ప్రదాత కేసీఆర్ బర్త్ డే వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మొక్కలు నాటి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ ముదిరాజ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, వి.శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కేసీఆర్‌పై రూపొందించిన డాక్యుమెంటరీని పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి వీక్షించారు.
ఇక అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, యూకే తదితర దేశాల్లోనూ బీఆర్ఎస్ ఎన్నారై శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ పిలుపు మేరకు వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. ఇక అమెరికాలో రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు.