హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరుతో పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. వేలాది మంది ప్రజలను నిరాశ్రయులను చేస్తున్నారని ఆగ్రహం హ్యక్తం చేశారు. బాధితులు చాలా ఆందోళనలో ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహిస్తున్నారని చెప్పారు. హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ, హైడ్రా బాధితులను పరామర్శించేందుకు హైదరాబాద్ హైదర్షా కోట్కు బయల్దేరింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌తో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం పోవాలని ఉపన్యాసాలు ఇస్తారని, తెలంగాణలో బుల్డోజర్ రాజ్యాన్ని ఆపాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు కానీ, మూసీ సుందరీకరణకు లక్షా యాభైవేల కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు.
రూ.1500 కోట్లతో మూసీ సుందరీకరణ డీపీఆర్ చేస్తున్నారని.. రూ.150 కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేరా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ లేవని, సర్కారు దవాఖానల్లో సరిగ్గా మందులు లేవన్నారు. ఏడు నెలల నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు రావట్లేదన్నారు. ఏది నీ ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పాలన పక్కనపెట్టి సుందరీకరణ చేస్తారా అని నిలదీశారు. పేదల ఇండ్లు కూల్చి.. బడా బడా కంపెనీలకు ఆ స్థలం ఇస్తారా అన్నారు. తుగ్లక్ ప్రభుత్వంలా అయిపోయిందని విమర్శించారు. ప్రజల ఉసురు పోసుకోవద్దని సూచించారు.
హైడ్రా పేరుతో బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీలో మురికి నీరు రాకుండా చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిపోయిందని అంటూనే గోదావరి నీళ్లు తెస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి నీళ్లు కాళేశ్వరం నుంచి కాకుండా మరెక్కడి నుంచి తెస్తారా చెప్పాలన్నారు. గోడు చెప్పుకుందామని ప్రజలే తెలంగాణ భవన్‌కు స్వచ్ఛంగా వచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశం మేరకే బాధితుల వద్దకు వెళ్తున్నామని చెప్పారు.
https://www.youtube.com/live/Hvb_UetrC2k