హైదరాబాద్, ఏప్రిల్ 23(నమస్తే తెలంగాణ) : బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసు కొట్టేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టేయాలని కోరారు. నిరుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభలో.. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న ప్రకటనతో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను మోసం చేశారని, బీజేపీ పరువు దెబ్బతీసేలా మాట్లాడారని రేవంత్‌రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. రాజకీయ కక్షతో చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టేయాలంటూ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.