నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రచార సమయంలో నమోదైన మూడు కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కోర్టుకు హాజరయ్యారు. నల్గొండ టూటౌన్, బేగంబజార్, మెదక్ జిల్లా కౌడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో తప్పక హాజరుకావాలని కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు సీఎం హాజరయ్యారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలు చేశారని, రాష్ట్రంలోని పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రేవంత్‌పై కేసులు నమోదయ్యాయి.
నేరం చేశారా? అని రేవంత్‌ను కోర్టు ప్రశ్నించగా, చేయలేదని సమాధానం ఇవ్వడంతో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇంకా చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని రేవంత్‌కు కోర్టు తెలిపింది. అన్ని కేసుల్లో కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.