హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో తమ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లాన్ విఫలమైంది. ఫార్మాసిటీని రద్దు చేసి.. ఫ్యూచర్ సిటీ పేరుతో దాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చి, చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువలు అడ్డగోలుగా పెంచి, లబ్ధి పొందాలనుకుంటే.. మొత్తానికే కథ అడ్డం తిరిగింది. రైతుల పోరాటంతో ఫార్మాసిటీపై ప్రభుత్వం దిగిరాగా.. ఫ్యూచర్ సిటీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి భూసేకరణ చట్టం-2013 ప్రకారం.. ప్రభుత్వం సేకరించిన భూములను ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం లేదు. ఒకవేళ అలా చేస్తే రైతులు తమ భూములను వెనక్కి తీసుకునే హక్కు ఉంటుంది. ఈ విషయం సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు తెలియంది కాదు. అయినా ఇన్నాళ్లూ ఫ్యూచర్ సిటీ పేరుతో ఎందుకు డ్రామా ఆడినట్టు? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీకి అంకురార్పణ జరిగిన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం, కడ్తాల్ తదితర మండలాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ప్రతిపాదించగా 2018 సెప్టెంబర్‌లోనే దీనికి పర్యావరణ అనుమతులు లభించాయి. 13,000 ఎకరాల భూములు ఇదివరకే సేకరించగా, మొదటి దశలో దాదాపు 8,500 ఎకరాల్లో ఫార్మాసిటీని ప్రారంభించాలని గత ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భూసేకరణ చట్టం- 2013తోపాటు తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ-2017 ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించి, పునరావాసానికి చర్యలు తీసుకోవాలి. ఏ ప్రాజెక్టు కోసం భూములు సేకరించారో, దానికే వినియోగించాలి. ఒకవేళ ప్రాజెక్టు అమలు కాకపోతే రైతులు తమ భూములను వాపస్ తీసుకునే అధికారం ఉంటుంది. అలాగే, పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం.. అనుమతులు తీసుకున్న ప్రాజెక్టును మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది. ఒకదాని కోసం పర్యావరణ అనుమతులు పొంది, మరో ప్రాజక్టు చేపట్టే అవకాశం లేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఫార్మాసిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు పలుమార్లు ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు, చుట్టూ ఉన్న ప్రభుత్వ భూముల్లో కలిపి ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో నాలుగో నగరాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఎనిమిది నెలలుగా ఊదరగొడుతున్నారు. రాష్ట్రంతోపాటు దేశ, విదేశాల్లో ఎక్కడ తిరిగినా ఇదే మాట చెప్తున్నారు. వాస్తవానికి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఇతర పనులకు వినియోగించరాదు. కానీ ప్రభుత్వం ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసింది. గతంలో ఫార్మాసిటీ అవసరాలకు తగినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యూనివర్సిటీగా మార్చింది. నిబంధనల ప్రకారం ఫార్మా కోర్సులు మాత్రమే ఉండాలి. కానీ గుండుసూది నుంచి విమానం వరకు అన్నీ తయారు చేసేలా శిక్షణ ఇస్తామని ప్రభుత్వం ఊదరగొడుతున్నది. ఇదే ప్రాంతంలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి 60 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల రాష్ర్టానికి ఏ వ్యాపారవేత్త వచ్చినా ఫోర్త్ సిటీలో స్థలం కేటాయిస్తామని, పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. మెట్రో రైలును సైతం ఫోర్త్‌సిటీ నుంచి వెళ్లేలా అలైన్‌మెంట్‌ను మార్చారు.
ఫార్మాసిటీని రద్దు చేసిన ప్రభుత్వం ‘సమీకృత గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల’ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది. ఓఆర్ఆర్ చుట్టూ ఆర్ఆర్ఆర్ మధ్య క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఒక్కో క్లస్టర్లో మూడు నుంచి నాలుగు ఫార్మా విలేజ్‌లు ఉండేలా ప్లాన్ చేసింది. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం నుంచే దీనికి అంకురార్పణ చేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో 1373 ఎకరాల్లో క్లస్టర్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత రంగారెడ్డి, సంగారెడ్డి.. ఇలా వరుసగా ఒక్కో జిల్లాలో భూసేకరణ చేపట్టింది. మొత్తం 20 వేల ఎకరాలు సేకరించే ప్రయత్నం చేసింది.
ఫ్యూచర్ సిటీ పేరుతో 25 వేల ఎకరాలు, ఫార్మా క్లస్టర్ల పేరుతో 20వేల ఎకరాల్లో ‘ఫార్మా’య చేయాలనుకున్న ప్రభుత్వం ప్లాన్ రైతుల పోరాటంతో బెడిసికొట్టింది. ఫార్మాసిటీ కింద భూములు కోల్పోయిన రైతులు కోర్టును ఆశ్రయించారు. ఫార్మాసిటీని ఇతర అవసరాలకు వినియోగించే వెసులుబాటు భూసేకరణ చట్టంలో లేదని, కాబట్టి ఫార్మాసిటీనే ఏర్పాటు చేయాలని లేదా తమ భూములు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఫార్మా క్లస్టర్ల బాధితులు సైతం ప్రభుత్వంపై తిరగబడ్డారు. తమ భూములను ఫార్మా కంపెనీలకు అప్పగించి గ్రామాల్లో విషం నింపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డిని సొంత నియోజకవర్గ ప్రజలే ఆగ్రహం వ్యక్తంచేశారు. న్యాయపోరాటం మొదలుపెట్టారు. ఇలా అటు ఫార్మాసిటీ, ఇటు ఫార్మా క్లస్టర్ల రైతుల పోరాటంతో ప్రభుత్వం వేసిన ప్లాన్ మొత్తం విఫలమై కథ అడ్డం తిరిగింది. ఫార్మాసిటీని కొనసాగించక తప్పని పరిస్తితి తలెత్తింది. ఫలితంగా.. ఫార్మాసిటీని కొనసాగిస్తామని ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేసింది. కేవలం తమ ‘ఫ్యూచర్’ కోసం చేపట్టిన నాలుగో సిటీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
గతంలో రాజశేఖర్‌రెడ్డి హయాంలో ‘ఫ్యాబ్ సిటీ’ పేరుతో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో భూములు సేకరించింది. ఆశించిన పెట్టుబడులు రాకపోవడం, ఇతర అవసరాలకు వినియోగించే అవకాశం లేకపోవడంతో దశాబ్దాలపాటు భూములు పడావుగా ఉండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేక విజ్ఞప్తుల తర్వాత కేంద్ర ప్రభుత్వం దఫదఫాలుగా ఆ భూమిని డీనోటిఫై చేస్తున్నది. పార్మాసిటీ భూముల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం మొండిపట్టుదలకు పోతే ఇదే జరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తాం. సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇస్తాం
ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం, అక్కడ మెగా టౌన్ షిప్‌ను నిర్మిస్తాం
ఫార్మాసిటీ దగ్గర అందుబాటులో ఉన్న 25వేల ఎకరాలను నూతన సిటీగా నిర్మిస్తున్నాం. అందులో యూనివర్సిటీలు, హెల్త్ టూరిజం డెవలప్మెంట్, ఈవీ బ్యాటరీలు, స్పోర్ట్స్ విలేజ్, ఐటీ, నాట్ పొల్యూటెడ్ ఫార్మాను డిజైన్ చేస్తున్నాం.
ఫార్మాసిటీకి బదులు ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ఫార్మా కస్టర్లు ఏర్పాటు చేస్తాం
ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్‌రోడ్డు మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం
ఫార్మాసిటీని అక్కడే కొనసాగిస్తాం