Rythu Bharosa | హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): ‘రైతుభరోసాపై మంత్రుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాం..’ ఇది పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు చెప్పిన మాట. ఇప్పటివరకు మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చిందీ లేదు.. అసెంబ్లీలో చర్చించిందీ లేదు. రైతుల అభిప్రాయాల సేకరణ పేరిట హడావుడిగా నాలుగు సమావేశాలు నిర్వహించిన కమిటీ ఆ తర్వాత ఆ ప్రక్రియకు రాం రాం చెప్పింది. రైతుభరోసా ఎప్పుడిస్తారు? ఎవరికి ఇస్తారు? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే వానకాలం సాగు సగం పూర్తయింది.
రైతులేమో పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలు సేకరించి రైతుభరోసా విధి విధానాలను రూపొందించేందుకు జూలై 2న ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఉన్నారు. కమిటీ రైతుల అభిప్రాయాలు సేకరించి 15 రోజుల్లో నివేదిక అందజేస్తుందని, దాని ఆధారంగా అసెంబ్లీలో రైతుభరోసాపై చర్చ పెడతామని సీఎం ప్రకటించారు.
కమిటీ ఏర్పాటు చేసి 40 రోజులైనా నివేదిక జాడ లేదు. రైతుల నుంచి అభిప్రాయ సేకరణకు ఉమ్మడి జిల్లాలవారీగా తొమ్మిది సమావేశాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ఇప్పటికి నాలుగు సమావేశాలు మాత్రమే నిర్వహించింది. జూలై 15న వరంగల్ సమావేశం నిర్వహించి ఆ తర్వాతే అపేసింది. అదే నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేకరించిన అభిప్రాయాలతోపాటు నాలుగు సమావేశాల్లో స్వీకరించిన అభిప్రాయాల ఆధారంగా మంత్రుల కమిటీ నివేదిక ఇస్తుందేమోనని అంతా భావించారు. కానీ, 15 రోజుల్లో ఇస్తారన్న నివేదిక అతీ గతీ లేకుండా పోయింది.
రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పిన ప్రభుత్వం.. సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. 11 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక్కపూట కూడా రైతుభరోసాపై ప్రభుత్వం చర్చించలేదు. ఈ నేపథ్యంలో రైతుభరోసాపై ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే.. మంత్రుల కమిటీ నుంచి నివేదిక తెప్పించుకొని, అసెంబ్లీలో చర్చ పెట్టి, విధి విధానాలు రూపొందించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇవేవీ చేయకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నదనే విమర్శలొస్తున్నాయి.