ప్రపంచానికి తెలంగాణ దిక్సూచి కావాలి. మన విజయ పతాక దేశవిదేశాల్లో సగర్వంగా ఎగరాలి. మన బ్రాండ్
హైదరాబాద్ ప్రపంచ బ్రాండ్ కావాలి. తెలంగాణను ప్రపంచ గమ్యస్థానంగా మార్చాలన్నదే మా తపన. సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనం దిశగా అడుగులేస్తున్నాం.
-సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని మూడు జోన్లుగా విభజించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాం తాన్ని అర్బన్ తెలంగాణగా, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని సబ్ అర్బన్ తెలంగాణగా, ట్రిపుల్ ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతాన్ని గ్రామీణ తెలంగాణగా అభివృద్ధి చేస్తామని వివరించారు. గ్రీన్ తెలంగాణ కోసం ‘మాస్టర్ ప్లాన్-2050’ని రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తొలుత గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, అక్కడి నుంచి నేరుగా పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం మట్లాడుతూ.. ఈ మూడు జోన్లల్లో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి? ఏ విధమైన మౌలిక వసతులు కల్పించాలి? అనే అంశాలపై మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో సాంస్కృతిక, ఆర్థిక పునరుజ్జీవనం దిశగా తమ ప్రభుత్వం అడుగులేస్తున్నదని సీఎం తెలిపారు. రూ.వెయ్యి కోట్లతో మూసీనది సుందరీకరణను చేపట్టామని వెల్లడించారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామని, ప్రజాపాలన దరఖాస్తులు కంప్యూటరీకరిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నామని, పేదల కోసం 4.5 లక్షల ఇండ్లను నిర్మించి ఇస్తామని, నియోజకవర్గానికి 3,500 ఇండ్లను కేటాయిస్తామని వివరించారు. ఇంటి స్థలం లేని వారికి స్థలం, స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల ఆర్థికసాయాన్ని అందిస్తామని చెప్పారు.
రాష్ర్టావతరణ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానిస్తే తప్పేమిటని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏ హోదాలో సోనియాగాంధీని ఆహ్వానించారని కొంతమంది ప్రశ్నిస్తున్నారని, ఏ హోదా ఉన్నదని, ఏ పదవిలో ఉన్నారని మహాత్మాగాంధీని జాతిపితగా గౌరవించుకుంటున్నామని ప్రశ్నించారు. చరిత్ర ఉన్నంతవరకు సోనియాగాంధీని తల్లిగా తెలంగాణ గుర్తించి గౌరవిస్తుందని చెప్పారు. ఈ గడ్డతో సోనియా బంధం రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు. తల్లిని ఆహ్వానించేందుకు బిడ్డకు పర్మిషన్ అవసరమా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రపంచానికే దిక్సూచి కావాలని, మన విజయ పతాక దేశ, విదేశాల్లో సగర్వంగా ఎగరాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచ నంబర్‌వన్ బ్రాండ్‌గా హైదరాబాద్ ఎదగాలని అభిలషించారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కతేల్చాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచ గమ్యస్థానంగా మార్చాలన్న తమ తపనకు నాలుగుకోట్ల మంది ప్రజలు ఆశీస్సులు అందించాలని కోరారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, స్పీకర్ మీరాకుమార్, అనాటి ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ చొరవతోనే రాష్ట్రం ఏర్పడిందని చెప్తూ, వారికి ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ చరిత్ర పుటలో ఈ ముగ్గురి చొరవ, త్యాగాలు నిలిచిపోతాయని కొనియాడారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, అధికారులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగపాఠంలో ‘మిత్రులారా’ అనే పదం 20 సార్లు వాడారు. దీంతో సభికుల్లో కొంతమంది ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మేరకు సోనియాగాంధీ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోను పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రదర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని నెరవేరుస్తామంటూ తాను 2004లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. ఈ పదేండ్లలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల అత్యంత ప్రేమ, అభిమానాలు చూపారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తున్నదని, అందరి ఆకాంక్షలను నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు ప్రజలకిచ్చిన గ్యారెంటీలను అమలుచేస్తుందని, రాష్ట్రప్రగతి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన సంబురా లు అంబరాన్నంటాయి. ‘పదేండ్ల పండు గ’ పేరుతో ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సీఎస్ శాంతికుమారి, మంత్రు లు హాజరయ్యారు. తెలంగాణ కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. లేజర్‌షో, బాణసంచా పేలుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ స్టాళ్లను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రారంభించి, పరిశీలించారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతిని తెలిపే 17 కళలను ప్రదర్శించారు. జాతీయజెండా రెపరెపలాడింది. రాష్ట్ర గీతమైన ‘జయ జయహే తెలంగాణ’ గేయానికి ఐదువేల మంది ట్రైనీ పోలీసులు జాతీయ పతాకాలతో ఫ్లాగ్‌వాక్ నిర్వహించారు. కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చిన వారితో ట్యాంక్‌బండ్ సందడిగా మారింది. ఈ గేయ రచయిత అందెశ్రీని గవర్నర్, సీఎం ఘనంగా సన్మానించారు. కళా ఉ త్సవాలకు వర్షం ఆటంకం కలిగించింది. తొలుత చిరుజల్లులు పడగా కార్యక్రమాన్ని కొనసాగించారు. రాత్రి 8 గంటల తర్వాత వర్షం జోరందుకోవడంతో సం బురాలను అర్ధాంతరంగా ముగించారు.