Congress Govt | నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందు ధాన్యానికి క్వింటాకు మద్దతు ధరపై రూ.500 బోనస్ అదనంగా ఇస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించగా, అధికారంలోకి రాగానే సన్నవడ్లకే బోనస్ అంటూ ప్రభుత్వం దబాయించింది. సన్నవడ్లకే బోనస్ అని ప్రభుత్వం ప్రకటించగానే ఇది మరో ధోకా పథకమేనని రైతులు అనుమానించారు. వారు భావించినట్టుగానే ప్రస్తుతం వానకాలం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు సన్న వడ్లను తెచ్చిన రైతులకే రూ.500 బోనస్ అని తిరకాసు పెట్టింది. ఇది ఎలాగూ జరిగేది కాదని గత అనుభవాలే చెప్తున్నాయి. అయినా సరే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు సన్నవడ్లను తెచ్చి బోనస్ పొందాలంటూ చెప్తున్న మాటలన్నీ ఒట్టివేనని తేటతెల్లం అవుతున్నది.
నల్లగొండ జిల్లాలో దాదాపు నెల రోజుల క్రితం ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. జిల్లాలో మొత్తం 340 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దొడ్డురకం ధాన్యం కోసం 260, సన్నవడ్ల కోసం ప్రత్యేకంగా 80 కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటివరకు దొడ్డురకం కొనుగోలు కేంద్రాలకు మాత్రమే ధాన్యం వచ్చింది. ఈ కేంద్రాల్లో సుమారు లక్ష టన్నుల ధాన్యం వరకు వచ్చి ఉండగా 20 వేల టన్నులను మాత్రమే కొనుగోలు చేశారు. మిగతా ధాన్యం విషయంలో మిల్లర్ల పేచీ, ట్రాన్స్పోర్ట్ సమస్య, కాంటాలు కాకపోవడం వంటి సమస్యలతో తీవ్ర జాప్యం జరుగుతున్నది. కొనుగోలు చేసే మిల్లర్లకు సన్నాల్లోని తేమశాతంతో నష్టంలేదు.
అందువల్ల ఈ సారి కూడా నేరుగా రైతులు సన్నాలను రైస్ మిల్లులకే అమ్ముకుంటున్నారు. క్వింటాకు రూ.2,200 నుంచి రూ.2,400 వరకు ధర లభిస్తుంది. ప్రభుత్వం ఇస్తామన్న రూ.500 బోనస్ కోసం ఆశ పడితే అసలుకే ఎసరు వస్తుందన్నది రైతుల భావన. కొనుగోలు కేంద్రాల్లో సన్నాలను విక్రయించాలంటే 17శాతం తేమ ఉండాలన్నది ప్రాథమిక నిబంధన. కానీ సన్నాలకు అదీ సాధ్యం కాదనేది రైతుల అభిప్రాయం. ఇంత ప్రహసనం కంటే కోసిన వడ్లను పొలం నుంచి నేరుగా మిల్లులకు తరలిస్తే తూకంలోనూ బోనస్ మందం కలిసి వస్తుందని రైతులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వ బోనస్ వైపు సన్నాల రైతులు ఆలోచించడమే మానేశారు. నిజంగా ప్రభుత్వ మద్దతు ధరకు బోనస్‌తో కలిపి రైతులకు ఒక్కో క్వింటాల్ సన్నాలకు రూ.2,820 ధర దక్కాలి. కానీ నేటికీ నల్లగొండ జిల్లాలో ఏ ఒక్క రైతుకు ఈ ధర లభించిన దాఖలాలు లేవు.
ఇక సన్నాల కొనుగోళ్లు నేటి వరకు శూన్యం
నల్లగొండ జిల్లాలో సన్నాల కోసం ప్రత్యేకంగా 80 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకూ ఒక్క గింజ కూడా రాలేదు. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్‌తోపాటు వేములపల్లి మండలంలో మూడు సన్నాల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా రైతులు నేటికీ ఒక్క గింజా తేలేదు.
బోనస్ కోసం చూసే పరిస్థితి లేదు
తేమ శాతంతో సంబంధం లేకుండా రైస్ మిల్లర్లు ధాన్యం కొంటున్నరు. తేమ శాతం 17 కోసం చూస్తే అంత మందం తూకంలో తేడా వస్తుంది. రూ.500 బోనస్ కోసం ఆశ పడితే రోజుల తరబడి తిప్పలు పడాల్సిందే. అందుకే నేరుగా మిల్లులకు అమ్ముకుంటున్నం. నిజంగా ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉంటే మిల్లుల వద్ద అమ్ముకున్న సన్నాలకు సైతం బోనస్ ఇవ్వాలి. మిల్లుల వద్ద కూడా ప్రభుత్వం మద్దతు ధర రూ.2,320కి తగ్గకుండా వచ్చేలా చూడాలి.
– నక పురుషోత్తం, రైతు, శెట్టిపాలెం
మద్దతు ధరనే లేదు..
మిర్యాలగూడ రైస్‌మిల్లుల యజమానులు సిండికేట్ అయ్యారు. రైతులకు రకరకాల సాకులతో మద్దతు ధరకు ఎగనామం పెడుతున్నరు. నాణ్యమైన సన్నాలకు సైతం రూ.2,300 ఇస్తున్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు పూర్తి మద్దతు ధర లభించింది. అవసరమనుకుంటే స్థానిక ఎమ్మెల్యే, నాయకులు రైస్ మిల్లుర్లతో మాట్లాడి మద్దతు ధర చెల్లించేలా రైస్‌మిల్లర్లను ఒప్పించేవారు. నేడు మద్దతు ధరనే సరిగ్గా వస్తలేదు. ఇక రేవంత్‌రెడ్డి ఇస్తానన్న బోనస్ గురించి ఎవ్వరూ ఆలోచించే పరిస్థితి లేదు.
-కారంగుల గోపి, తక్కెళ్లపహాడ్, మిర్యాలగూడ మండలం