పటాన్చెరు టౌన్, జూన్ 29 : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో 2025 జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ఘటనకు ఏడాది కావస్తున్నది. తెలంగాణ పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది. ఇందులో 55 మంది కార్మికులు చనిపోయారు. పేలుడు తీవ్రతకు పలువురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. 8 మంది కార్మికుల అవశేషాలు పూర్తిగా లభించకపోవడం ప్రమాద తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సి రావడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రోజువారీ కూలిపై ఆధారపడి జీవించే అనేక కుటుంబాలు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి. భర్తలను కోల్పోయిన మహిళలు.. తండ్రులను కోల్పోయిన చిన్నారులు.. కుమారులను కోల్పోయిన వృద్ధ తల్లిదండ్రులు ఇప్పటికీ ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు. కుటుంబ పోషకులను కోల్పోయిన కారణంగా పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇంటి నిర్వహణ వంటి సమస్యలు అనేక కుటుంబాలను వెంటాడుతున్నాయి. ప్రమాదం జరిగిన రోజును తలుచుకుంటూ ఇప్పటికీ భయాందోళనలకు గురవుతున్నామని బాధితులు చెప్తున్నారు. పొట్ట చేతబట్టుకొని ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి ఉపాధి కోసం వచ్చిన కార్మికులు ఆ రోజు పనికి వెళ్లి మృత్యువాతపడ్డారు.
కోటి పరిహారం ప్రకటించిన సీఎం.. ఇచ్చింది 45 లక్షలే
ప్రమాదం జరిగిన మరుసటి రోజు సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికీ రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో పనిచేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అప్పట్లోనే వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి పరిహారంలో ఇప్పటివరకు రూ.45 లక్షలు మాత్రమే చెల్లించారు. పరిహారం విషయంలో ప్రభుత్వం, సిగాచి యాజమాన్యం మధ్య స్పష్టత లేకపోవడంతో చెల్లించిన నగదు మూడు విడుతలుగా బాధిత కుటుంబాలకు అందింది. హైకోర్టులో ఈ అంశంపై విచారణ కొనసాగుతుండగా, పూర్తి పరిహారం ఎప్పుడు అందుతుందో అన్న ఆశతో బాధితులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తం పరిహారం అందుతుందా? లేదా అనే అనుమానాలు కూడా బాధిత కుటుంబాలను వేధిస్తున్నాయి.
బాధ్యులపై చర్యలేవి?
సిగాచి ఘటనపై బాధ్యులను గుర్తించేందుకు ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ, లేబర్ ఎంప్లాయ్మెంట్ సెక్రటరీ, ఫైర్ డిపార్ట్మెంట్ సెక్రటరీతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి విచారణ జరిపి బాధ్యులను గుర్త్తించి వారిపై చర్యలు తీసుకుంటామని స్వయంగా సీఎం రేవంత్ ఆ రోజు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు ఎవరినీ గుర్తించలేదు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తులు జరిగినప్పటికీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. భద్రతా ప్ర మాణాల అమల్లో లోపాలు, కాలం చెల్లిన రి యాక్టర్ల వినియోగం, పురాతన భవనం తదితర వైఫల్యాలు బయటపడ్డాయి. ఇంత పెద్ద విషాదం జరిగినా బాధ్యులపై తీసుకున్న చర్య లు ఏమిటి? భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు? అనే విషయాలపై స్పష్టత లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన అప్పట్లోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధిత కుటుంబాలకు కావలసింది సానుభూతి ప్రకటనలు కాదని, పూర్తి పరిహారం, న్యాయం కావాలని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
ఆగమైన కుటుంబాలు
ప్రమాదంలో 55 మంది మరణించగా, ఇందులో 8 మంది జాడ తెలియరాలేదు. 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏడాది కావస్తున్నా దయనీయంగానే ఉన్నది. భర్తను కోల్పోయిన మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం కూలి పనులకు వెళ్తున్నారు. వృద్ధ తల్లిదండ్రులు తమ కుమారులను తలుచుకుని కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఒకప్పుడు నెలాఖరుకు జీతం వస్తే ఇంట్లో సంతోషం ఉండేది. ఇప్పుడు అప్పులు, అద్దెలు, పిల్లల ఫీజులు, మందుల ఖర్చులు ఎలా భరించాలో తెలియక అనేక కుటుంబాలు ఆందోళనతో జీవిస్తున్నాయి. మరోవైపు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుల పరిస్థితి కూడా బాధాకరంగానే ఉన్నది. శరీరంపై కాలిన గాయాల మచ్చలు ఇప్పటికీ చెరిగిపోలేదు. కొందరి చేతులు, కాళ్లు సరిగా పనిచేయడం లేదు. మరి కొందరు ఎక్కువ సేపు నిలబడలేని పరిస్థితిలో ఉన్నారు. గాయాలు మానినా, ఆ రోజు చూసిన భయానక దృశ్యాలు మాత్రం వారి మనసులను వెంటాడుతూనే ఉన్నాయి. పేలుడు శబ్దం గుర్తుకొస్తే ఉలిక్కిపడుతున్నామని, రాత్రిళ్లు నిద్రపట్టడం లేదని పలువురు బాధితులు చెప్తున్నారు. ఒకప్పుడు కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించిన వారు ఇప్పుడు ఇతరుల సహాయంపై ఆధారపడాల్సి వస్తున్నది.
హరీశ్‌రావు చెబితేనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు
సిగాచిలో ప్రమాదం జరిగిన రోజే ఘటనా స్థలానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు తెలుసుకొని ఓద్చారే ప్రయత్నం చేశారు. కాగా, కార్మికుల కుటుంబీకులు పరిశ్రమ వద్దకు భారీగా చేరుకొని తన వారి కోసం ఏడుస్తూ ఎవరిని అడగాలో తెలియక బిక్కముఖంతో ఎదురుచూస్తుండగా.. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు అధికారులకు సూచించగా, అధికారులు వెంటనే ఏర్పాటు చేశారు. పనికోసం వచ్చిన తమ వారి వివరాలను తెలుసుకునేందుకు కుటుంబీకులు హెల్ప్ డెస్క్ వద్ద గుమిగూడారు. కార్మికుల ఆధార్ కార్డులు, వారి ఫొటోలు, ఫోన్ నంబర్లు ఇతర వివరాలు ఇస్తూ తమ వారి ఆచూకీ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు.